
ప్రతి అర్జీని పరిష్కరించండి: కలెక్టర్
అమలాపురం రూరల్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వస్తున్న ప్రతి అర్జీని సంతృప్తికర స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్ గోదావరి భవన్ వద్ద ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సుమారు 250 అర్జీలను కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ నిషాంతి, జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి, డ్వామా పీడీ మధుసూదన్, ఎస్‌డీఎస్ కృష్ణమూర్తి, డీఎల్‌డీఓ రవీంద్ర స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌లో వచ్చే ప్రతి అర్జీని సంబంధిత జిల్లా అధికారులకు అందించి, నిర్దేశిత గడువు లోగా పరిష్కరించేలా చూస్తున్నామన్నారు. వివిధ సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రతా పింఛన్లు, ఇళ్ల స్థలాల మంజూరు, రెవెన్యూ అంశాలపై అర్జీలు అందాయన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ ఎస్.కార్తీక్, డీపీఓ శాంతలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఎస్‌ఈలు కృష్ణారెడ్డి, పి.రామకృష్ణారెడ్డి, ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావు దొర, డీఎస్‌ఓ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 32 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 32 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుకు తమ సమస్యలపై ఫిర్యాదు పత్రాలు అందించారు. అర్జీదారుల నుంచి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి వారితో కొద్దిసేపు మాట్లాడి సమస్య పరిష్కారానికి ఎస్పీ చొరవ చూపారు. అదృశ్యమైన తన తమ్ముడి అచూకీ తెలపాలని, రెండు నెలల కిందట అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ న్యాయం జరగలేదని ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి గ్రామానికి చెందిన సుంకర సత్యనారాయణ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి కొద్దిసేపు నేలపైనే బైఠాయించాడు. తనకు న్యాయం చేయాలని అభ్యర్థించాడు. పోలీసులు తక్షణమే అతడిని అక్కడి నుంచి లేవదీసి ఏమైనా సమస్య ఉన్నా, ఫిర్యాదు ఉన్నా నేరుగా ఎస్పీ వద్దకు వెళ్లి చెప్పాలని సూచించారు. దీంతో బాధితుడు సత్యనారాయణ జిల్లా ఎస్పీని కలసి తన సమస్యపై ఏకరవు పెట్టాడు. తన చిన్నాన్న కొడుకు సుంకర ఈశ్వరరావు 15 ఏళ్లుగా అమలాపురం దుడ్డివారి అగ్రహారంలో ఉంటున్నాడని, కొబ్బరి ఒలుపు పనిచేసుకుంటూ జీవించే తన తమ్ముడు గత మార్చి 14 నుంచి పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని పేర్కొన్నాడు. ఈ అదృశ్యం కేసును త్వరితగతిన విచారించి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు.
మాజీ కౌన్సిలర్‌పై చర్యలు తీసుకోవాలి
అమలాపురానికి చెందిన మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ (టీడీపీ)పై, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణానికి చెందిన తోలేటి ఓం ప్రకాష్ ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. బాకీ నిమిత్తం తనను వేధిస్తున్నాడని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రతి అర్జీని పరిష్కరించండి: కలెక్టర్