
కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు జీఎస్టీ మినహాయించాలి
అంబాజీపేట: కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని సామాజిక వేత్త, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నేలపూడి స్టాలిన్‌బాబు సెంట్రల్ జీఎస్టీ అదనపు చీఫ్ కమిషనర్ ప్రశాంత్‌కుమార్ కాకర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐఆర్‌ఎస్ అధికారి ప్రశాంత్ కుమార్ ఇటీవల ఈ పదవిలో నియమితులయ్యారు. ఈ సందర్భంగా స్టాలిన్‌బాబు ఆయనకు విశాఖపట్నంలోని సెంట్రల్ జీఎస్టీ కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ సుభిక్షమైన వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఎంతో ఖ్యాతి గాంచిందని, ఇటీవల కోనసీమ తలసరి ఆదాయం గణనీయంగా పడిపోయిందని, అనంతపురం కంటే తక్కువగా ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారని వివరించారు. జీఎస్టీ మినహాయింపులు ఇవ్వడం ద్వారా తలసరి ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆయనకు వివరించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని ఆయన హామీ ఇచ్చారని స్టాలిన్ బాబు తెలియజేశారు.