చిరు ప్రాణానికి చిటుక గండం | - | Sakshi
Sakshi News home page

చిరు ప్రాణానికి చిటుక గండం

Jun 30 2025 4:27 AM | Updated on Jun 30 2025 4:27 AM

చిరు

చిరు ప్రాణానికి చిటుక గండం

నిర్లక్ష్యమే ప్రమాద హేతువు

అప్రమత్తతతో ముందుగా మేలుకోవాలి

టీకాతో ప్రాణానికి తప్పనున్న ముప్పు

రాయవరం: తొలకరి పలకరించింది. భూమిపై గడ్డి మొలుస్తోంది. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు గడ్డి మొలిచే ప్రాంతాల్లో నిద్రావస్థలో ఉన్న క్రిములు బలపడి జీవాలు తినే పచ్చగడ్డి ద్వారా పశువుల పొట్టలోకి వెళ్తాయి. ఈ క్రిములు పశువుల్లోని చిటుకు వ్యాధికి కారణమవుతాయి. గొర్రెలు, మేకల్లాంటి జీవులు చిటుకు రోగం బారిన పడితే నిమిషాల్లోనే చనిపోతాయి. ఆవులకు, గేదెలకు జబ్బవాపు, గొంతువాపు టీకాల మాదిరిగానే చిటుకు రోగానికి గొర్రెలు, మేకలకు టీకాలు వేస్తారు. అందుకే ‘చిటుకు’ రోగంపై పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో గొర్రెలు, మేకలు సుమారు 48 వేల పైబడి ఉన్నాయి. వీటికి ఇప్పటికే టీకాలు వేస్తున్నారు. అలాగే తొలకరికి ముందుగా గొంతువాపు, జబ్బవాపు వ్యాధి నిరోధక టీకాలు ప్రతి పశువైద్య కేంద్రం ద్వారా ఆవులకు, గేదెలకు టీకాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ అధికారులు వ్యాధి ఎప్పుడు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? నివారణ పద్ధతులపై పెంపకందారులకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

వ్యాపించేది ఇలా

గొర్రెలు, మేకలకు గాలికుంటు, మసూచి, పీపీఆర్‌, చిటుకు రోగం, దొమ్మ, గొంతువాపు మొదలైన అంటువ్యాధులు త్వరగా సోకుతాయి. ఒక మంద నుంచి మరో మందకు అత్యంత వేగంగా, సులభంగా వ్యాపించి ప్రాణనష్టాన్ని కలిగిస్తాయి. చాలా సందర్భాల్లో చికిత్స చేసేందుకు తగిన వ్యవధి కూడా ఉండదు. ఇలాంటి ప్రమాదకర, ప్రాణాంతక వ్యాధులకు చికిత్స బదులు నివారణే ముఖ్యమైందని గుర్తించాలి. అంటు వ్యాధులు సోకక ముదే ఈ వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తే గొర్రెలు, మేకల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ చిటుకు వ్యాధి మేకలకన్నా గొర్రెలకు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది.

నివారణ చర్యలు ఇవీ

వ్యాధి రాకుండా ముందుగానే టీకాలు వేయించాలి. అకాల వర్షాలు, తొలకరి వర్షాలకు పెరిగిన గడ్డిని పశువులు తినడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. వరి కోసిన తర్వాత మిగిలిన కర్రలను ఎక్కువగా మేపకూడదు. గొర్రెలు, మేకలకు మూడు నెలలకోసారి నట్టల నివారణ మందు వేయాలి. 30 రోజుల వయసు కలిగిన గొర్రెలు, మేక పిల్లలకు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. వ్యాధికారక బ్యాక్టీరియా విడుదల చేసే టాక్సిన్లు, విషపదార్థం విడుదల కావడంతో ఈ వ్యాధి సోకుంది. వ్యాధి సోకిన గొర్రె గిర్రున గాలిలో ఎగిరి కింద పడి మరణిస్తుంది. చిటికెలో జీవాలు చనిపోతాయి కనుకనే చిటుక వ్యాధిగా పేర్కొంటున్నారు.

వ్యాధి లక్షణాలు

రాత్రి బాగా ఉండి తెల్లవారే సరికల్లా ఎక్కువ సంఖ్యల్లో జీవాలు మత్యువాత పడుతుంటాయి. ఎలాంటి లక్షణాలు లేకుండా కళ్ల ముందే హఠాత్తుగా గాలిలోకి ఎగిరి కిందపడి మరణిస్తాయి. జ్వరం, పళ్లు కొరకడం, వణకడం, బిగుసుకుని పోవడం, కాళ్లతో పొట్టను తన్నుకోవడం, చెట్లకు గట్టిగా తలను ఆనించి ఉండడం, కాళ్లు బిగిసి పట్టి నడవడం, శ్వాస కష్టమవడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత దశలో అధిక విరేచనాలు, కడుపు నొప్పి, మందకొడిగా ఉండడం, సరిగ్గా మేయకపోవడం వంటి లక్షణాలుంటాయి.

ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం

చిటుకు వ్యాధి సోకిన జీవాలకు చికిత్స చేసే వ్యవధి ఉండదు. వ్యాధి రాకుండా ముందుగానే టీకాలు వేయించాలి. వ్యాధి సోకకముందే నిరోధక టీకాలు వేయిస్తే జీవాల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జిల్లాలో టీకాలు వేయడం ప్రారంభించాం. అన్ని పశువైద్యశాలలు, ఆర్‌బీకేల్లో తగినన్ని టీకాలు అందుబాటులో ఉన్నాయి. గొర్రెలు, మేకల యజమానులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్‌ వెంకట్రావు, జేడీ, పశు సంవర్ధక శాఖ, అమలాపురం

చిరు ప్రాణానికి చిటుక గండం1
1/1

చిరు ప్రాణానికి చిటుక గండం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement