
అన్నదాతపై అధికార జులుం!
● తన పొలంలో పంటను అన్యాయంగా కోసి విక్రయించడంపై ఆగ్రహం
● జెండాలు పాతి ఊరిలో పరువు తీశారు
● వెల్ల సోమేశ్వరస్వామి ఆలయ ఈఓపై కౌలు రైతు ఫిర్యాదు
రామచంద్రపురం: కంచే చేను మేసిన చందంగా దేవదాయశాఖ వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతల అండదండలతో ఖర్చుల పేరిట స్వామివారి సొమ్ములు మింగేస్తున్నారని మండలంలోని వెల్ల సోమేశ్వరస్వామి వారి దేవస్థానం ఈఓ సీహెచ్ శ్రీనివాస్‌పై ఓ రైతు ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే స్వామి వారికి సుమారు 104 ఎకరాల సాగు భూమి ఉంది. ఆలయ సేవలకు 40 ఎకరాలు పోగా మిగిలిన 48 ఎకరాలను గ్రామానికి చెందిన రైతులకు బహిరంగ వేలంలో మూడేళ్లకోసారి కౌలుకు ఇస్తుంటారు. మిగిలిన 16 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. దీనిపై చర్యలు తీసుకోకపోగా సదరు ఆక్రమణదారులపై ఎకరానికి ఇంత అని సొమ్ములు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 48 ఎకరాల నుంచి ఆలయానికి ఏటా సుమారు రూ.27 లక్షల ఆదాయం వస్తున్నప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యం. ఇదిలా ఉండగా ఈఓ కూటమి నేతల ప్రోద్బలంతో ఇంకా గడువు ఉండగానే కౌలు చేస్తున్న రైతులను వెళ్లగొట్టి తమ అనుయాయులకు ఆ భూములు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే వెల్లలోని దేవదాయ శాఖ అధికారి కార్యాలయం ఎప్పుడూ తాళం వేసి ఉండడం చర్చనీయాంశమవుతోంది.
కౌలు చేస్తున్న 12 మందిలో సుమారు 5 నుంచి ఆరుగురికి బకాయిలు కట్టాల్సి ఉంది. వీరిలో గ్రామానికి చెందిన పట్నాల గణపతి మూడేళ్లుగా 3 ఎకరాలు సాగు చేస్తూ ఆఖరి సంవత్సరంలో రెండో పంట పండిన తరువాత శిస్తు కట్టి తదనంతరం తిరిగి నిర్వహించే బహిరంగ వేలంలో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయనకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏప్రిల్ 23న సదరు భూమిలో ఈవో ఎర్రజెండాలు వేయించారు. ఆ సమాచారాన్ని కూడా గణపతికి ఇవ్వలేదు. కూటమి నేతల ఒత్తిడితో 3 ఎకరాల్లోని పంటను మే 17న కోయించి మాసూళ్లు చేయించి కొనుగోలుదారునితో కుమ్మకై ్క ధాన్యాన్ని విక్రయించారని ఆ రైతు ఆరోపిస్తున్నారు. దీనిపై సదరు రైతు రాజకీయ ఒత్తిళ్లతో దౌర్జన్యం చేసి తన పంటను మాసూలు చేసి, జమా ఖర్చులు చెప్పకుండా ధాన్యాన్ని విక్రయించారని, ఈ మేరకు ఈఓపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శనివారం పోలీసులకు గణపతి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా ఈఓ శ్రీనివాస్ వెల్లతో పాటు, మరో 12 ఆలయాలకు ఇన్‌చార్జి ఏఓగా కూడా ఉన్నారు. ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ఈఓ నిరాకరించారు.
నా పరువుకు నష్టం కలిగించారు
రెండో పంట చేతికి వచ్చే సమయంలో ఎటుంటి నోటీసులు ఇవ్వకుండా చేలో జెండాలు వేసి గ్రామంలో నా పరువు తీసేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈఓ శ్రీనివాస్ నా పంటను కోసేసి జమా ఖర్చులు చెప్పలేదు. కనీసం రశీదు కూడా ఇవ్వలేదు. ఆయన చేసిన దౌర్జన్యంపై పోలీసులను ఆశ్రయించాను. దీనిపై కోర్టులో పరువునష్టం దావా కూడా వేస్తాను.
– పట్నాల గణపతి, దేవస్థానం భూమి కౌలు రైతు

అన్నదాతపై అధికార జులుం!

అన్నదాతపై అధికార జులుం!