
అయినవిల్లిలో భక్తజన సందోహం
స్వామివారికి రూ.2.21 లక్షల ఆదాయం
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 48 మంది, స్వామి పంచామృతాభిషేకాల్లో ఇరుగురు దంపతులు పాల్గొన్నారు. లక్ష్మీగణపతి హోమంలో 18 జంటలు, పంచామృతాభిషేకాల్లో మూడు జంటలు పాల్గొన్నాయి. స్వామి వారి సన్నిధిలో ఇద్దరు చిన్నారులకు అక్షరాభ్యాసం, ఐదుగురు చిన్నారులకు తులాభారం, ఒక చిన్నారికి అన్నప్రాశన నిర్వహించారు. స్వామికి ముగ్గురు భక్తులు తలనీలాలు సమర్పించారు. 31 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 3100 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాలు ద్వారా రూ.2,20,638 ఆదాయం లభించినట్లు ఇన్‌చార్జి ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకట దుర్గ భవాని తెలిపారు.
వాడపల్లిలో వసతి గదులకు రూ.9.9 లక్షల విరాళం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో వసతి గదుల నిర్మాణానికి ఓ కుటుంబం రూ.9.9 లక్షలు విరాళంగా సమర్పించారు. ఈ క్షేత్రానికి శనివారం వేలాదిగా భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. వారికి వసతి గదుల నిర్మాణానికి, వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా ఆదివారం విశాఖపట్నం కేఆర్‌ఎం కాలనీకి చెందిన కీర్తిశేషులు బలభద్రుని వెంకటనాగ సత్యసాయి సిరి అంజన తల్లిదండ్రులు విజయలక్ష్మి – మాధవరావు దంపతులు, వారి కుటుంబ సభ్యులు పై మొత్తాన్ని సమర్పించారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దాతలకు దేవస్థానం తరపున డీసీ అండ్ ఈఓ చక్రధరరావు స్వామివారి చిత్రపటాన్ని అందచేశారు. నిత్య పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి నిత్య కళ్యాణం, ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తుల అష్టోత్తర నామార్చనలు నిర్వహించారు. ఆదివారం స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, అన్న ప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూల విక్రయం, ఆన్‌లైన్ తదితర సేవల ద్వారా దేవస్థానానికి రూ.7,81,206 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు.