
నకిలీ ఆదాయపన్ను అధికారుల అరెస్టు
● నాలుగేళ్ల క్రితం బియ్యం వ్యాపారిని
బెదిరించి దోచుకోవడంతో కేసు
● పోలీసుల అదుపులో నలుగురు
● పరారీలో ఇద్దరు
రాజోలు: సుమారు ఏడేళ్ల క్రితం ఆదాయ పన్ను అధికారులమని బెదిరించి విలువైన పత్రాలతో పాటు నగదుతో పరారైన నలుగురిని రాజోలు పోలీసులు అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపర్చారు. సీఐ నరేష్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు 2018 సంవత్సరంలో కూనవరంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లుల వద్దకు ఆరుగురు వ్యక్తులు కారులో వచ్చి ఆదాయ పన్ను అధికారులమని యజమానిని బెదిరించి భూమి దస్తావేజులు, ప్రామిసరీనోట్లు, బ్యాంక్ చెక్ బుక్స్, ఆధార్ కార్డులు, నగదు తీసుకుని వెళ్లిపోయారు. రైస్ మిల్లు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటిలో కేసు నమోదు చేశారు. అయితే నిందితులైన మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన యడ్ల అరవింద్, గూడపల్లిపల్లిపాలేనికి చెందిన సోమాని సందీప్, గూడపల్లికి చెందిన మొల్లేటి మణికంఠ, పి.గన్నవరం మండలం పోతవరానికి చెందిన నేలపూడి మురళీశ్రీధర్ పోలీసుల కళ్లుకప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆరుగురికి నలుగురిని అరెస్ట్ చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. 2020 సంవత్సరంలో వీరిని తెలంగాణ గచ్చిబౌలి పోలీస్‌లు ఇలాంటి కేసులోనే అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలయ్యారని సీఐ వివరించారు.