ఉత్తరం..దక్షిణ ఉంటేనే.. | - | Sakshi
Sakshi News home page

ఉత్తరం..దక్షిణ ఉంటేనే..

Jun 29 2025 2:33 AM | Updated on Jun 29 2025 2:33 AM

ఉత్తరం..దక్షిణ ఉంటేనే..

ఉత్తరం..దక్షిణ ఉంటేనే..

● బదిలీల సిఫార్సు
కోరుకున్న చోటు

ఇష్టారాజ్యంగా ఇంజినీరింగ్‌

అసిస్టెంట్ల బదిలీలు

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్‌ కూడా ఇష్టారాజ్యంగా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,271 ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు ఉండగా.. ఐదేళ్లు పూర్తయి బదిలీకి అర్హత పొందిన వారు 1,113. వీటిలో 904 రిక్వెస్ట్‌లు ఉన్నాయి. వీరి బదిలీలు అంతర్‌ జిల్లాల ప్రాతిపదికన జరుగుతున్నా కౌన్సెలింగ్‌ మాత్రం ఆయా జిల్లాల పంచాయతీరాజ్‌ అధికారుల సమక్షంలో జరుగుతున్నాయి. ఇక్కడ కూడా కూటమి నేతల సిఫారసు లేఖలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రంపచోడవరం ఏజెన్సీకి చెందిన ఇద్దరు గిరిజన ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు సొంత ప్రాంతాలైన ఏజెన్సీకి బదిలీ కోరుకున్నారు. అసలు ఏజెన్సీకి వెళ్లడానికే ఎవరూ ఇష్టపడని పరిస్థితులున్నా.. వీరికి అవకాశం ఇవ్వకుండా సిఫారసు లేఖ తప్పనిసరి అని చెప్పారు. దీంతో, వారి పరిస్థితి డోలాయమానంలో పడింది. అడ్డగోలుగా జరుగుతున్న బదిలీల కౌన్సెలింగ్‌పై జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో మెరిట్‌కు పాతరేస్తున్నారు. కూటమి నేతల సిఫారసు లేఖలకే పెద్దపీట వేస్తున్నారు. ఎవరైనా కోరుకున్న చోటు దక్కించుకోవాలనుకుంటే అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవాల్సిందే. వారు ఒక్కో సీటుకు ఒక్కో రేటు నిర్ణయించి ఎడాపెడా లేఖలు ఇచ్చేస్తున్నారు. కౌన్సెలింగ్‌ పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారులు నేతల సిఫారసులు ఆధారంగా బదిలీలకు తెర తీయడంతో సచివాలయ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖలో జరిగిన బదిలీని కూటమి నేతల సిఫారసుతో నిలుపు చేయించుకున్న ఓ అధికారి కనుసన్నల్లోనే ఈ బాగోతం సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను కూడా స్వయంగా కూటమి నేతలనే ఆశ్రయించడంతో వారు చెప్పినట్టు చేయాల్సిన దుస్థితిలోకి ఆయన జారిపోయారు.

బదిలీకి అర్హులు 616 మంది

గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న విలేజ్‌ అగ్రికల్చరల్‌, ఇంజినీరింగ్‌ తదితర అసిస్టెంట్ల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమై, ఆదివారం వరకూ జరగనుంది. కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలకు సంబంధించిన విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్ల బదిలీలకు కాకినాడలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చైర్మన్‌గా ఉన్న కమిటీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 684 మంది విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వీరిలో ఐదేళ్లు పూర్తి చేసిన 616 మంది బదిలీలకు అర్హులుగా గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం 1 నుంచి 205 వరకూ సీరియల్‌ నంబర్లు ఉన్న వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. శనివారం 206 నుంచి 410 నంబర్‌ వరకూ, ఆదివారం 411 నుంచి 616 నంబర్‌ వరకూ బదిలీలు చేపట్టాలి. ఈ మూడు జిల్లాల్లోని దాదాపు మూడు వంతుల నియోజకవర్గాల్లో కూటమి ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలున్న వారికే బదిలీల్లో అవకాశం కల్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజాప్రతినిధుల జాబితా ప్రకారమే..

ఏజెన్సీలో సర్వీసు, దివ్యాంగులు, భార్యాభర్తల వంటి అంశాలకు బదిలీల కౌన్సెలింగ్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, ఈ నిబంధనలను బుట్టదాఖలు చేసి, నేతల సిఫారసు లేఖలున్న వారికి మాత్రమే కోరుకున్న చోటు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులు పంపించిన సిఫారసు లేఖల్లో పేర్కొన్న జాబితాను అనుసరించే బదిలీలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు ఏ సచివాలయంలో ఏ పోస్టుకు ఎవరిని బదిలీ చేయాలో ముందుగానే జాబితా రూపొందించి, సిఫారసు లేఖలు జత చేసి మరీ పంపించారని విశ్వసనీయంగా తెలిసింది. ఆ జాబితా ప్రామాణికంగానే బదిలీలు చేస్తున్నారని కౌన్సెలింగ్‌లో పాల్గొని బయటకు వస్తున్న అసిస్టెంట్లు ఆరోపిస్తున్నారు. మెరిట్‌ జాబితాలో ఉన్నవారు 1, 2, 3 స్థానాలకు ఆప్షన్లు పెట్టుకున్నప్పటికీ వాటిని హోల్డ్‌లో పెడుతున్నట్లు చెబుతున్నారు. మెరిట్‌ జాబితా టాప్‌–10లో ఉన్న వారికి కూడా ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కనబెడుతుండటంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు విలేజ్‌ అసిస్టెంట్లు సిద్ధపడుతున్నారు.

సొమ్ములిస్తేనే సిఫారసు లేఖలు

కోరుకున్న సచివాలయానికి బదిలీ కావలంటే మొదట గ్రామ టీడీపీ కమిటీ సభ్యుల ఆశీస్సులుండాలి. వారు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలంటే చేయి తడపాల్సిందే. ఈవిధంగా ఆయా నియోజకవర్గాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటు నిర్ణయించి, కూటమి నేతలు వసూళ్ల పర్వానికి తెర తీశారు. ఈవిధంగా వీలునుబట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ ముడుపులు గుంజారని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కోనసీమ జిల్లా రాజోలు, అమలాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం; కాకినాడ జిల్లా తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, కాకినాడ రూరల్‌; తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్‌ తదితర నియోజకవర్గాల్లో కూటమి నేతలు వసూళ్ల పర్వాన్ని అడ్డగోలుగా కొనసాగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.35 వేల జీతంతో పని చేసే చిరుద్యోగులని కూడా చూడకుండా ముక్కుపిండి మరీ వసూలు చేశారని అంటున్నారు.

కూటమి ఏలుబడిలో బది‘లీలలు’

మెరిట్‌కు పాతర

సిఫారసు లేఖకు రేటు ఫిక్స్‌ చేసిన ప్రజాప్రతినిధులు

ఆ తరువాతే కావాల్సిన చోటుకు బదిలీ

కౌన్సెలింగ్‌లో అధికారులు లేఖలు అడుగుతున్నారని సచివాలయ

అసిస్టెంట్ల ఆరోపణ

ఇవిగో ఉదాహరణలు

కోనసీమ జిల్లా రాజోలు దీవికి చెందిన మెరిట్‌ ఉన్న ఒక అసిస్టెంట్‌ శుక్రవారం నాటి కౌన్సెలింగ్‌లో తాను కోరుకున్న మండలం కోసం అభ్యర్థించగా.. అక్కడి ప్రజాప్రతినిధి లేఖ ఉందా అని కౌన్సెలింగ్‌లోనే నేరుగా అడగడంతో అవాక్కయ్యారని సమాచారం. వాస్తవానికి రాజోలు సబ్‌ డివిజన్‌లో 9, పి.గన్నవరం సబ్‌ డివిజన్‌లో 20 పోస్టులు ఉన్నాయి. మెరిట్‌లో ముందు వరుసలో ఉన్నా సిఫారసు లేఖ అవసరమేమిటని ప్రశ్నించిన పాపానికి ఆ పోస్టును హోల్డ్‌లో పెట్టేశారు. పైగా, అతడిని ఏజెన్సీ వెళ్లాల్సి ఉంటుందని, అందుకు సిద్ధమేనా అని అడిగారంటున్నారు.

రాజోలు నియోజకవర్గం నుంచి స్పౌజ్‌ కోటాలో భార్యాభర్తలు స్థానికంగా ఏదైనా మండలంలో అవకాశం ఇవ్వాలని ఆప్షన్‌ పెట్టుకున్నారు. వారిలో భర్తకు స్థానికంగా అవకాశం కల్పించి, భార్యను మాత్రం దూరంగా వేరే మండలానికి ఖాయం చేశారని తెలియవచ్చింది.

80 శాతం దివ్యాంగుడైన ఒక అసిస్టెంట్‌ను కూడా సిఫారసు లేఖ లేకుండా ఏమీ చేయలేమని చెప్పారంటే కౌన్సెలింగ్‌ ఎంత పారదర్శకంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.

చిన్న పిల్లలున్నారు.. స్థానికంగా అవకాశం కల్పించాలని, పిల్లలకు స్కూళ్లలో ఫీజులు చెల్లించేశామని రాజోలు ప్రాంతంలో ఆప్షన్‌ పెట్టుకున్న వారికి ఎక్కడో దూరంగా ఉన్న ఐ.పోలవరం మండలం వెళ్లాల్సిందిగా సూచించారని తెలియవచ్చింది.

రంపచోడవరం ఏజెన్సీలో మూడేళ్లు దాటి పని చేస్తున్న ఒక అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌కు కాకినాడ జిల్లా శంఖవరం లేదా రౌతులపూడి మండలాల్లో ఆప్షన్‌ ఇచ్చారు. అయితే అక్కడకు నేతలు వేరే వారికి సిఫారసు చేయడంతో ఈయనను హోల్డ్‌లో పెట్టారని అంటున్నారు. ఏజెన్సీలో అంత కాలం పని చేసినా సిఫారసు లేఖ లేదనే కాారణంతో అవకాశం కల్పించకుంటే ఇక కౌన్సెలింగ్‌కు అర్థమేముంటుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.

తొండంగి మండలంలో ఆప్షన్‌ పెట్టుకున్న మరో అసిస్టెంట్‌ను కూడా నేతల సిఫారసు లేఖ లేదనే కారణంతో పక్కన పెట్టినట్లు చెబుతున్నారు.

కాకినాడకు చెందిన ఒక మహిళా అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌ దగ్గర్లో ఉన్న కాకినాడ రూరల్‌ లేదా కరప మండలాలకు ఆప్షన్‌ పెట్టుకున్నారు. కాకినాడ రూరల్‌ నుంచి సిఫారసు లేఖ లేదనే కారణంతో తుని నియోజకవర్గానికి పంపించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement