
ఇల వైకుంఠంగా వాడపల్లి
● భక్తులతో కిక్కిరిసిన ఆలయం
● స్వామికి రూ.55.94 లక్షల ఆదాయం
కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి వేకువ జాము నుంచే వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము పట్టిన భక్తులు మాడ వీదుల్లో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామివారికి పూజాదికాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. శనివారం సాయంత్రం 4.30 గంటల వరకూ దేవస్థానానికి వచ్చిన భక్తుల ద్వారా రూ.55,94,479 ఆదాయం వచ్చినట్టు డీసీ, ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ, ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము ట్రాఫిక్ నియంత్రించి ఆలయ ఆవరణలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ధర్మపథంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాల కళాకారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆశా కార్యకర్తల నియామకానికి
దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమలాపురం: జిల్లాలో రూరల్ 75, అర్బన్ నాలుగు ప్రాంతాల్లో 79 మంది ఆశా కార్యకర్తల నియామకానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఎం.దుర్గారావు దొర శనివారం తెలిపారు. జూన్ 30వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న పీహెచ్‌సీలు, అర్బన్ ఆరోగ్యకేంద్రాలలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవలసిందిగా కోరారు. కార్యకర్తల నియామకం గ్రామీణ, పట్టణ ఆరోగ్య పారిశుధ్య, పౌష్టికాహార కమిటీ ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో ప్రతిభ కలిగిన మూడు దరఖాస్తులను జిల్లా కార్యాలయానికి పంపాలని తెలిపారు. డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా నియామకం జరుగుతుందని దుర్గారావు దొర తెలిపారు.
ఈవీఎం గోడౌన్లకు పటిష్ట భద్రత
కలెక్టర్ మహేష్‌కుమార్
ముమ్మిడివరం: ఈవీఎంలు, వీవీ ప్యాట్ల గోదాములకు పటిష్ట భద్రత కల్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాల మూడో అంతస్తులో గోదాములను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల స్థితిగతులను పరిశీలించి భద్రతకు తీసుకుంటున్న చర్యలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గొడౌన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించినట్టు ఆయన తెలిపారు.
దోమల నియంత్రణతో
మలేరియా, డెంగీ అదుపు
డీఎంహెచ్‌వో డాక్టర్ దుర్గారావు దొర
అమలాపురం టౌన్: దోమల నియంత్రణతోనే మలేరియా, డెంగీ వంటి వ్యాధులను అరికట్టవచ్చని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.దుర్గారావు దొర సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే దోమల నిర్మూలన నూరు శాతం అమలవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాధుల నియంత్రణపై వైద్యశాఖ ప్రచురించిన వాల్ పోస్టర్‌ను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆయన శనివారం ఆవిష్కరించి దోమల నివారణలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా నియంత్రణ అధికారి ఎన్.వెంకటేశ్వరరావు, ఉప యూనిట్ అధికారి ఆదినారాయణ, సూపర్‌వైజర్ కె.మేరీ జ్యోతి, జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ వీవీవీ త్రిమూర్తులు పాల్గొన్నారు.

ఇల వైకుంఠంగా వాడపల్లి

ఇల వైకుంఠంగా వాడపల్లి