
కొబ్బరి @ రూ.22 వేలు
● చరిత్రలో తొలిసారి రికార్డు ధర
● ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో
1.8 లక్షల ఎకరాల్లో సాగు
● ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో
గణనీయంగా తగ్గిన దిగుబడి
● ఉత్తరాదికి దిక్కయిన ఆంధ్రా కొబ్బరి
సాక్షి, అమలాపురం: జాతీయ మార్కెట్‌లో ఆంధ్రా కొబ్బరి రికార్డుల మీద రికార్డు సృష్టిస్తోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొబ్బరి కాయ దిగుబడి తగ్గడం ఆంధ్రా రైతులకు వరంగా మారింది. కొబ్బరి చరిత్రలో తొలిసారి అంబాజీపేట మార్కెట్‌లో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.22 వేలు పలికింది. లంక గ్రామాల్లో కొబ్బరి కాయ రూ.23 వేల వరకూ ధర పలుకుతోందని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 1.8 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఒక్క కోనసీమ జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. గత ఏడాది నుంచి పచ్చికాయ, ముక్కుడు కాయ (నిల్వ కాయ) వెయ్యి కాయల ధర రూ.10 వేలకు ఎప్పుడూ తగ్గలేదు. గత మే నెలలో ఒకానొక సమయంలో రూ.12 వేల వరకూ ఉండగా తరువాత నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. మే చివరి వారంలో రూ.16 వేలకు చేరింది. ఈ నెల మొదటి వారంలో కొబ్బరి కాయ ధర రూ.17,500 నుంచి రూ.18,500 వరకూ పెరిగింది. రెండు రోజుల క్రితం రూ.20 వేల వరకు పెరగగా, శనివారం మార్కెట్‌లో ఏకంగా రూ.22 వేలు పలికింది. మరో వారం రోజుల్లో ధర మరింత పెరగవచ్చని రైతులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కొబ్బరి పండే దక్షిణాది రాష్ట్రాల్లో దిగుబడి గణనీయంగా తగ్గగా కేరళలో దిగుబడి మరింత పతనమైంది. ఇక్కడ చెట్టుకు సగటు దిగుబడి 50 కాయలు కాగా ఇప్పుడు 15 కాయలకు పడిపోవడంతో ఉత్తరాది అవసరాలు మొత్తాన్ని రాష్ట్రంలో కొబ్బరి తీర్చాల్సి వస్తోంది. దీనికితోడు గత ఏడాది కాలంగా దిగుబడిగా వచ్చిన కొబ్బరి ఇటు రైతుల వద్ద కానీ, వ్యాపారుల వద్ద కానీ నిల్వ ఉండటం లేదు. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతుల వద్ద నుంచి, వ్యాపారుల వద్ద నుంచి వారం రోజుల వ్యవధిలోనే ఎగుమతి అవుతోంది. ఇది కూడా ధర పెరుగుదలకు కారణమవుతోంది. రాష్ట్రం నుంచి ఉత్తరాదిలోని గుజరాత్, హర్యానా, మహారాష్ట్రతో పాటు బిహార్, ఉత్తర ప్రదేశ్‌లకు పచ్చికాయ అధికంగా ఎగుమతి అవుతోంది. ధర పెరిగినా రైతులు ఆచితూచి విక్రయిస్తున్నారు. పెరిగిన ధర కొబ్బరి రైతుల్లో జోష్ నింపింది.