సాగు.. బెంగ తీరేలా..! | - | Sakshi
Sakshi News home page

సాగు.. బెంగ తీరేలా..!

Jun 28 2025 5:41 AM | Updated on Jun 28 2025 5:41 AM

సాగు.

సాగు.. బెంగ తీరేలా..!

పెదపళ్లలో వరినాట్లు వేస్తున్న బెంగాలీ కూలీలు

చింతలూరులో బెంగాలీ కూలీల ఆకుతీత పనులు

బెంగాలీ కూలీల వైపు రైతుల చూపు

అక్కడి పద్ధతిలో చురుగ్గా నాట్లు

సమయం..పెట్టుబడి ఆదా

అధిక దిగుబడులకూ అవకాశం

ఆలమూరు: పొరుగు రాష్ట్రం కార్మికులు లేనిదే మన రాష్ట్రంలో అనుకున్న స్థాయిలో వరి సాగయ్యే అవకాశం లేదు. ఇప్పటికే సాగులో ఆధునిక యంత్రాలతో పాటు వరినాట్లు వేసే డ్రమ్ము సీడర్‌ యంత్రం అందుబాటులోకి వచ్చినా కూలీల కొరత మాత్రం తగ్గడం లేదు. ఖరీఫ్‌, రబీ సీజన్లలో వరినాట్లు వేసేందుకు కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. వారి కొరతను ఎదుర్కొనేందుకు వలస కూలీలపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో పశ్చిమ బంగాల్‌లో అమలవుతున్న వరిసాగు పద్ధతులు స్థానిక రైతులను ఆకర్షిస్తున్నాయి. అక్కడి విధానాలతో అధిక దిగుబడుల సాధనతో పాటు కూలీల కొరతను ఇక్కడి రైతులు అధిగమిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వారు స్థానిక రైతులకు వరమనే చెప్పాలి. గతంలో వరినాట్లు సమయంలో ఆకుతీతకు మగవారిని, వరినాట్లకు ఆడ కూలీలను వినియోగించుకునే వారు. అయితే బెంగాలీ కూలీల రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గత పదేళ్ల నుంచి బెంగాలీ కూలీలు చక్కని నేర్పిరితనంతో సమయాన్ని, పెట్టుబడిని ఆదా చేస్తూ ఆకుతీత నుంచి వరినాట్ల వరకూ పనులు చేస్తుండటంతో ఏటా వారి విధానాలకు అకర్షితులయ్యే రైతుల సంఖ్య పెరుగుతుంది.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 1.64 లక్షల ఎకరాల్లో వరిసాగవుతోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.06 లక్షల మంది రైతులు సాగులో నిమగ్నమయ్యారు. ధవళేశ్వరం వద్ద తూర్పు, మధ్య డెల్టాకు సాగునీటిను విడుదల చేయడంతో పాటు వర్షాలు కురుస్తున్నందున ఆకుతీత, వరినాట్లు సీజన్‌ చురుగ్గా సాగుతోంది.

బెంగాలీ విధానంలో నాట్లు

వరినాట్లు వేసే సమయంలో బెంగాలీ కూలీలు స్థానిక కూలీలకు భిన్నమైన శైలిని అవలంబిస్తారు. ఈ కార్మికులు రోజంతా పనిచేయకుండా కేవలం తెల్లవారుజామున పనులు ప్రారంభించి వాయు వేగంతో పనిచేసి మధ్యాహ్నానికే పని ముగించుకుంటారు. అప్పటి నుంచి సాయంకాలం వరకూ విశ్రాంతి తీసుకుని రాత్రికి స్వయంగా నచ్చిన వంటకాలు చేసుకుని హాయిగా జీవనం సాగిస్తుంటారు. వారి పద్ధతిలో వరినాట్లు సులభతరం కావడంతో ఏటా పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చే కూలీల సంఖ్య పెరుగుతుంది. దీంతో జిల్లాలో ప్రస్తుతం సుమారు 70 శాతం మేర నారుమడులకు వారినే వినియోగిస్తున్నారు. వారి విధానంలో వేసే నాట్ల వల్ల పంటకు తెగుళ్ల బెడద తగ్గడంతో పెట్టుబడులు కూడా ఆదా అవుతుండటంతో రైతులు వారి పని విధానంపైనే ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో వరినాట్లు వేసేందుకు వచ్చే బెంగాలీ కూలీలకు స్థానిక రైతులు స్థావరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక వసతులు సమకూరుస్తున్నారు.

పెట్టుబడి ఆదా

స్థానిక వ్యవసాయ కూలీల కన్నా భిన్నంగా బెంగాలీలు వరినాట్లు వేగంగా వేయడంతో పాటు సమదూరంలో వరినాట్లు వేయడం వల్ల వరి నారు ఆదా అవుతుంది. దీనివల్ల్ల ఖర్చు తగ్గడంతో పాటు ఆశాజనకమైన దిగుబడులు రావడంతో రైతులు వారిపై మక్కువ చూపుతున్నారు. వరిసాగులో తక్కువ నారును ఉపయోగించి అధిక దిగుబడులు సాధించాలన్న ప్రచారానికి తగ్గట్టుగా బెంగాలీలు నాట్లు వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వరిసాగులో గతంలో రైతులు ఎకరానికి 25 కిలోల విత్తనాలు నారు వినియోగించేవారు. బెంగాలీ కూలీల రాకతో ఎకరానికి 15 నుంచి 20 కిలోల విత్తనాలు మాత్రమే వినియోగిస్తున్నారు. స్థానిక కూలీలు 30 రోజుల వయసు గల నారును మాత్రమే వినియోగిస్తారు. స్థానిక కూలీలు వేసిన నాట్లు మూనలుగా తిరిగేందుకు సుమారు పది రోజులు పడుతుంటే బెంగాలీ కూలీలు వేసే నాట్లు నాలుగు రోజుల తరువాత మూనలు కడుతున్నాయి. స్థానిక కూలీలు ఎకరాకు సుమారు 45 పోగులకు పైగా వినియోగిస్తుంటే అదే విస్తీర్ణానికి బెంగాలీలు కేవలం 15 నుంచి 20 పోగులు వాడుతున్నారు.

ఎకరాకు నలుగురు కూలీలే..

ఎకరా పొలానికి వరినాట్లు వేసేందుకు సాధారణంగా ఆరుగురు కూలీలు అవసరం కాగా బెంగాలీ విధానంలో నలుగురు మాత్రమే ఉండి అనుకున్న గడువు మేరకు పని పూర్తి చేసుకుని వెళుతున్నారు. అలాగే వారి వద్ద ఉన్న ప్రత్యేక పరికరం ద్వారా తాము చేసిన పనిని సెంట్లతో సహా కొలతలు చేసి కచ్చితంగా కొలుచుకుంటారు. అలాగే ఒప్పందానికి అనుగుణంగా కూలీ సొమ్మును తీసుకుంటారు. దిగుబడుల్లో సైతం భారీ వ్యత్యాసం కనపడుతుండడంతో స్థానిక రైతుల పంట పండినట్టు అవుతోంది. సాధారణంగా స్థానిక కూలీల చేత పూర్తి చేసిన ఆకుమడులు అందుబాటులోకి వచ్చాక ఆకుతీత, వరినాట్లు వేసేందుకు ఎకరాకు రూ.పది వేలు ఖర్చవుతుంది. అయితే బెంగాలీ కూలీలు మాత్రం ఎకరాకు రూ.నాలుగు వేలు మాత్రమే తీసుకుంటున్నారు. బెంగాలీ కూలీల చేత చేయించుకున్న పనుల వల్ల ఎకరానికి ఐదు బస్తాల వరకూ దిగుబడులు అదనంగా వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. వరిసాగు ఖర్చు సుమారు రూ.ఆరు వేల వరకు తగ్గుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సాగు.. బెంగ తీరేలా..!1
1/1

సాగు.. బెంగ తీరేలా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement