
శుభకార్యాలకు శూన్యం!
కొత్తపేట: తెలుగు మాసాల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్నది ఆషాడం. హిందూ పురాణాల ప్రకారం ఈ మాసానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పాటించాల్సిన నియమాలు ఎన్నో ఉన్నాయి. గురువారం నుంచి ప్రారంభమై వచ్చే నెల 24తో ఈ నెల ముగుస్తుంది. ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. వివాహాది శుభకార్యాలు ఏమీ ఈ నెలలో తలపెట్టరు. ఈ మాసంలో అనేక పర్వదినాలున్నాయి. ఆషాడ శుద్ధ ఏకాదశి వైష్ణవ ఆరాధనలకు ముఖ్యమైంది. దీనినే తొలి ఏకాదశి అని అంటారు. అప్పటి నుంచి ప్రతి వారం ఏదో ఒక పండుగ, వ్రతం, పూజలు నిర్వహిస్తారు. ఈ నెలలోనే గురు పూర్ణిమ, దేవశయన ఏకాదశి, వారాహి నవరాత్రి పూజలు ఈ మాసం తొలిరోజు నుంచే ప్రారంభమవుతాయి. తెలంగాణలో బోనాల ఉత్సవాలు, ఒడిశా రాష్ట్రం పూరీలో జగన్నాథుని రథయాత్ర వంటి ముఖ్యమైన కార్యక్రమాలు, ఉపవాస పండుగలు నిర్వహిస్తారు. చాతుర్మాసోత్సవాలు సైతం ఈ నెలలోనే ప్రారంభమౌతాయి. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడని, అందుకే ఈ కాలంలో శుభకార్యాలు చేయడాన్ని నిషేధించారని చెబుతారు. అయితే విష్ణుమూర్తిని పూజించడం, మంత్రాలను జపించడం శుభప్రదంగా పరిగణిస్తారు. దుర్గామాత ఆరాధన శక్తినిస్తుందని చెబుతారు. ఈ మాసంలో దుర్గాదేవిని శాకంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దానధర్మాలకు ప్రాధాన్యం గల మాసమని, దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందంటారు. ఆషాఢ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు, తర్పణాలు నిర్వహించడం ద్వారా వారి అనుగ్రహం లభిస్తుందంటారు.
గోరింటాకు ప్రత్యేకం
ఈ కాలంలో గ్రామీణులు గోరింటాకు పెట్టుకుంటారు. దీనితో సైన్స్ ముడిపడి ఉంది. వర్షాలు కురవడం వల్ల క్రిమికీటకాలు పెరిగి అంటువ్యాధులు ప్రబలుతాయి. చర్మవ్యాధుల నివారణకు చేతులు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా బాలికలు, యువతులు, మహిళలు ఎక్కువగా గోరింటాకు అలంకరణగా భావిస్తారు. పెళ్లి ఈడుకొచ్చిన యువతులకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడని అంటారు.
వధూవరులకు తప్పని విరహం
ముఖ్యంగా ఆషాఢమాసం అనగానే గుర్తుకువచ్చేది కొత్తగా పెళ్లెన దంపతులు కలవకూడదనే ఆచారం. ఇది పూర్వం నుంచీ వస్తోంది. దీనిలో భాగంగా అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. దీని వెనుక శాసీ్త్రయ కారణాలు ఉన్నాయని పెద్దలు, పండితులు చెబుతారు. అత్త, మామలు దాటిన గుమ్మం అల్లుడు దాటకూడదని, అత్తా, కోడలు ఒక ఇంటిలో ఉండకూడదని రకరకాల కధనాలతో పాటు ఈ మాసం నుంచే వర్షాకాలం ప్రారంభమౌతుంది. రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టి పనులు ప్రారంభిస్తారు. కొత్తగా పెళ్లైన యువకుడు వ్యవసాయ పనులకు డుమ్మా కొట్టి అత్తవారింట్లోనే గడుపుతాడు.. ఇక్కడ పనులు సాగవనే కారణంతో ఈ నెల రోజులు నూతన దంపతులు కలవకూడదనే నియమం పెట్టారంటారు.
ఆషాఢానికి ఎన్నో ప్రత్యేకతలు
వర్షాలతో సాగు పనులకు శ్రీకారం
వైష్ణవ ఆరాధనలకు ప్రాశస్త్యం

శుభకార్యాలకు శూన్యం!