
ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడితే చర్యలు
కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: షెడ్యూల్ కులాలు, తెగల వారిపై అన్యాయంగా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో 2025 రెండో త్రైమాసానికి సంబంధించి ఆయన అధ్యక్షతన కమిటీ సభ్యులతో జిల్లా స్థాయి పౌర హక్కుల రక్షణ ఎస్సీ ఎస్టీ దురాగతాల నివారణ చట్టం అమలుపై ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మాని టరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు సత్వరం పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. సత్వర విచారణకు అవసరమైన ధ్రువ పత్రాలు ఎప్పటికప్పుడు జారీ చేయాలన్నారు. ఆయా వర్గాల హక్కులు, రక్షణ కోసం ఏర్పాటైన చట్టాల పటిష్ట అమలుకు పోలీస్, న్యాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. గత సమావేశపు తీర్మానాలపై తీసుకున్న చర్యలను సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి పి. జ్యోతిలక్ష్మీదేవి వివరించారు. బాధితులకు పరిహారం, ఉపాధి కల్పన విషయంలో జాప్యం జరగకుండా పటిష్టంగా అమలు చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా 66 కేసులు నమోదు కాగా, 47 ప్రాథమిక విచారణ దశలో, 20 కేసులు చార్జిషీట్ దశలో ఉన్నాయన్నారు బాధితులకు రూ.41.25 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉందని, ప్రభుత్వం నుంచి మంజూరు కాగానే బాధితులకు అందజేస్తామని ఆయన తెలిపారు. లక్షిత వర్గాల సంక్షేమానికి వసతి గృహాలలో గెయిల్ సీఎస్సార్ నిధులతో కిచెన్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ టి.నిశాంతి, డీఆర్‌ఓ రాజకుమారి, ఆర్డీవోలు కె.మాధవి, పి.శ్రీకర్, డి.అఖిల, ఏఎస్పీ ప్రసాద్, డీఎస్పీలు ప్రసాద్ , మరళీమోహన్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.