
జనావాసాల మధ్య సెల్ టవర్ వద్దు
సింగరాజుపాలెం ప్రజల అభ్యంతరం
దేవరపల్లి: జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మించవద్దని నల్లజర్ల మండలం సింగరాజుపాలెం ప్రజలు అభ్యంతరం తెలిపారు. టవర్ నిర్మిస్తున్న స్థలం వద్ద పలువురు గ్రామస్తులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ నిర్మాణం వల్ల ప్రమాదాలతో పాటు అనారోగ్యాలకు గురవుతామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ శివారున టవర్ నిర్మిస్తే ఇబ్బంది లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలు నివశిస్తున్న కాలనీలో ఓ వ్యక్తికి చెందిన స్థలంలో గురువారం అర్ధరాత్రి టవర్ నిర్మాణానికి గోతులు తవ్వడం ప్రారంభించారని, ఈ విషయం తెలుసుకున్న పలువురు అక్కడకు చేరుకుని పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 2018లో ఇదే ప్రాంతంలో సెల్‌టవర్ నిర్మాణ పనులు చేపట్టగా అప్పటి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లి నిలుపుదల చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. పంచాయతీ అనుమతి లేకుండా మళ్లీ అర్ధరాత్రి పనులు చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బోయపాటి శేషు, గద్దే శ్రీనివాస్, వామిశెట్టి వెంకటేశ్వరరావు, అయినపర్తి చిన్న తదితరులు పాల్గొన్నారు.