
అన్నా హజారే దృష్టికి పర్యావరణ విధ్వంసం
తాళ్లరేవు: రాష్ట్రంలోని విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు జరుగుతున్న తీవ్ర పర్యావరణ విధ్వంసాన్ని పరిష్కరించడంలో మార్గదర్శకత్వాలు ఇవ్వాలని కోరుతూ సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త అన్నా హజారేకు వైల్డ్‌కానోపి హేబిటాట్స్ ఓషన్స్ వలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు సంగాడి ధర్మారావు వినతిపత్రం అందజేశారు. పరిశ్రమలు, ముఖ్యంగా చమురు శుద్ధి, రసాయన కర్మాగారాలు చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు పేర్కొన్నారు. నియంత్రణలేని కాలుష్యం సముద్ర జలాలను కలుషితం చేయడం ద్వారా జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తూ, వేలాది తీరప్రాంత వర్గాల జీవనోపాధికి ప్రమాదం కలిగిస్తున్నాయని తెలిపారు. కాలుష్యం కారణంగా కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం, కోస్టల్ రెగ్యులేటరీ జోన్, ఎకో సెన్సిటివ్ జోన్‌లో మడ అడవులను క్రమపద్ధతిలో నాశనం చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో సంచరించే ఆలివ్ రిడ్లే తాబేళ్ల సామూహిక మరణాలు, వలస పక్షుల క్షీణత, అరుదైన వృక్ష, జంతుజాలాలు అంతరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. దీని పరిష్కారానికి కృషి చేయాలని అన్నాహజారేను కోరినట్టు ధర్మారావు విలేకర్లకు తెలిపారు.