ఒకటిన సాగునీరు విడుదల | Sakshi
Sakshi News home page

ఒకటిన సాగునీరు విడుదల

Published Sat, May 25 2024 3:35 PM

-

అమలాపురం రూరల్‌: కోనసీమ జిల్లాకు జూన్‌ ఒకటో తేదీ నుంచి సాగునీరు విడుదల చేస్తామని, జూన్‌ 10 నాటికి సాగునీరు అందుతుందని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా చెప్పారు. జూన్‌ 15 నుంచి నారుమడి నర్సరీల సాగును చేపట్టాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఖరీఫ్‌ సాగు, తుపానుల కోసం విపత్తు నిర్వహణ, ఉపశమనం, సన్నద్ధత చర్యల పై సమీక్షించారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో ముందస్తుగా తక్కువ పంట కాలపరిమితి గల వరి వంగడాల సాగును ప్రారంభించి అక్టోబర్‌ నెల చివరి నాటికి పంట దిగుబడి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నవంబర్‌ నెలలో సంభవించే తుపానుల నుంచి రక్షణ పొందేలా రైతులను చైతన్య పరచాలని, విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. గోదావరి ఏటిగట్టు సుమారు 380 కిలోమీటర్లు మేర ఉందన్నారు. ఈ ఏటిగట్టు ఆరు చోట్ల బలహీనంగా ఉందని పటిష్ట పరిచేందుకు అంచనాలు రూపొందించి సమర్పిస్తే నిధులు మంజూరు చేస్తామన్నారు. ముందస్తు సాగు కొంతమేర కష్టమే అయినప్పటికీ రైతులను ఒప్పించి ఎక్కడా క్రాఫ్‌ హాలిడేకు ఆస్కారం లేకుండా సమన్వయం వహించాలన్నారు. ప్రధాన కాలువలలో గురప్రుడెక్క, పూడిక తీత పనులు నరేగా ద్వారా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నరేగా ఉ పాధి పనుల మూలంగా మెటీరియల్‌ కాంపోనెంట్‌ కూడా ఆయా గ్రామాల అభివృద్ధికి సమ కూరనున్నదన్నారు. అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లో రామేశ్వరం మొగ తదితర సముద్ర ముఖ ద్వారాల వద్ద డ్రెడ్జింగ్‌ పనులు చేపట్టి ముంపు బె డదను నివారిస్తామన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజయ్‌, డీఆర్‌ఓ ఎం.వెంకటేశ్వ ర్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షకు

594 మంది గైర్హాజర్‌

ముమ్మిడివరం: పదవ తరగతి సప్లిమెంటరీ తెలుగు పరీక్షకు జిల్లాలో 987 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 393 మంది పరీక్ష రాసినట్టు డీఈఓ ఎం.కమలకుమారి తెలిపారు. 594 మంది గైర్హాజర్‌ గైర్హాజరు అయినట్టు చెప్పారు. జిల్లాలో వీరి కోసం 16 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 9 పరీక్షా కేంద్రాలను, డీఈఓ ఎం.కమలకుమారి నాలుగు పరీక్షా కేంద్రాలను, అసిస్టెంట్‌ కమీషనర్‌ ఎం.సురేష్‌ మూడు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

ప్రశాంతంగా ఇంటర్‌

సప్లిమెంటరీ పరీక్షలు

అమలాపురం టౌన్‌: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో శుక్రవారం ప్రశాంతంగా ప్రారభమయ్యాయి. ఈ మేరకు అమలాపురంలో డీఐఈవో వనుము సోమశేఖరరావు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం సెకండ్‌ లాంగ్వేజ్‌, ఒకేషనల్‌ పరీక్షలు జరిగాయి. జనరల్‌ ఇంటర్మీడియెట్‌ పరీక్షకు జిల్లాలో 2,170 మంది విద్యార్థులకు గాను 2,036 మంది హాజరయ్యారు. ఒకేషనల్‌ ఇంటర్మీడియెట్‌ పరీక్షకు 278కి గాను 237 మంది హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి జరిగిన పరీక్షలకు జనరల్‌ విభాగం నుంచి 287 మంది విద్యార్థులకు గాను 252 మంది, ఒకేషనల్‌ విభాగానికి 161 మందికి గాను 139 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఒక సిటింగ్‌ స్క్వాడ్‌, డిస్ట్రిక్ట్‌ ఎగ్జామినేషన్‌ కమిటీ సభ్యులు, డీఐఈవోలు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. శనివారం ఇంగ్లిషు పరీక్ష జరుగుతుందని డీఐఈవో సోమశేఖరరావు తెలిపారు.

గురుకులాల్లో 28 నుంచి స్పాట్‌ అడ్మిషన్లు

కాకినాడ సిటీ: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశ పరీక్ష నిర్వహించి, మెరిట్‌ ప్రాతిపదికన అడ్మిషన్లు కల్పిస్తున్నామని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సమన్వయాధికారి జి.వెంకటరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా మిగిలిన ఖాళీల భర్తీకి ప్రవేశ పరీక్ష రాసి సీటు పొందని, ప్రవేశ పరీక్ష రాయని విద్యార్థులకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పి.వెంకటాపురంలోని గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశానికి బాలురకు ఈ నెల 28న, బాలికలకు 29న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని వివరించారు. అలాగే, కాకినాడ సాంబమూర్తి నగర్‌లోని గురుకుల కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలకు బాలురకు ఈ నెల 30న, బాలికలకు 31న కౌన్సెలింగ్‌ జరుగుతుందన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థినీ విద్యార్థులు ఆధార్‌, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇంటర్‌లో ప్రవేశాలకు టెన్త్‌ మార్కుల జాబితాతో ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. ఉదయం 10 గంటల తర్వాత వచ్చే విద్యార్థులను కౌన్సెలింగ్‌కు అనుమతించబోమని వెంకటరావు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement