
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ సెకండ్ వేవ్ కన్నా త్వరగానే ముగుస్తుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం కరోనాకు మందు లేదని, దీన్ని అరికట్టాలంటే మాస్కులు ధరించడాన్ని ఓ ఉద్యమంగా ఆచరించాలని ఆయన ప్రజలకు సూచించారు. ‘ఈ ఏడాది మార్చిలో ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్ నుంచి వచ్చిన వారితో ఢిల్లీలో కరోనా వ్యాపించింది. వీరు రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో తిరగడంతో దాదాపు 32,000 మంది కరోనా బారినపడ్డారు. ఆ సంఖ్య జూన్ 23 నాటికి మరింత ఎక్కువైంది. దీంతో ఢిల్లీవాసులు చాలా కఠిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ప్రస్తుతానికి మాస్కు ధరించడం ఒక్కటే కరోనాకు మందు. చాలామంది మాస్కులను మెడలో వేలాడదీయడం, ముక్కు కింది భాగంలో ధరించడం చేస్తున్నారు. ఇది సరైంది కాదు. మాస్క్ వల్ల ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉండొచ్చు కానీ మనకు మరో ప్రత్యామ్నాయం లేదని గుర్తుంచుకోవాలి’ అని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. (ఢిల్లీని వణికిస్తున్న కరోనా ‘థర్డ్ వేవ్’)
కాలుష్యం పెరగడానికి ఇదే కారణం...
‘జనవరి నుంచి అక్టోబరు 15 వరకు ఢిల్లీలో వాయు కాలుష్యం తక్కువగానే నమోదైంది. కానీ చుట్టూ ఉన్న రాష్ట్రాలో గడ్డి దహనం చేయడం వల్ల నగరంలో వాయుకాలుష్యం పెరుగుతోంది. దీన్ని అరికట్టడానికి పీయూఎస్‌ఏ సంస్థ సరికొత్త విధానంతో ముందుకు వచ్చింది. గడ్డిని కాల్చడానికి బదులు ఎరువుగా ఉపయోగించే విధానాన్ని తెచ్చింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణ రాష్ట్రాలు గడ్డిని కాల్చడం ఆపడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా పీయూఎస్‌ఏ సంస్థకు సహాయపడుతుందని’ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. (‘టపాసులు కాల్చం, లక్ష్మీ పూజ చేసుకుంటాం’)