భర్తను చంపించటానికి తాళిబొట్టును తాకట్టు పెట్టి...

Woman Mortgage Mangalsutra For Supari To Assassinate Her Husband - Sakshi

ముంబై: భర్తను చంపించటానికి అవసరమైన డబ్బుల కోసం ఏకంగా మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టిందో మహిళ. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బివాండికి చెందిన టాక్సీ డ్రైవర్‌ ప్రభాకర్‌, శృతి భార్యాభర్తలు. శృతికి హితేష్‌ వాలా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శృతి, ప్రభాకర్‌కు విడాకులు ఇచ్చి ప్రియుడ్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. భర్తను విడాకులివ్వమని అడగ్గా.. అతడు కూడా వేరే మహిళతో సంబంధం కొనసాగిస్తుండటంతో ఇవ్వనన్నాడు. దీంతో గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. విడాకుల విషయాన్ని శృతి తన ఫ్రెండ్‌ ప్రియతో చర్చించింది. ఆమె సుపారీ కిల్లర్‌ సంతోష్‌ రెడ్డిని కలవమని సలహా ఇచ్చింది. ఆ తర్వాత సంతోష్‌రెడ్డితో రూ. 4 లక్షలకు డీల్‌ కుదిరింది. ఈ డబ్బుల కోసం శృతి బ్యాంకులో దాచుకున్న రూ.3 లక్షలు తీసింది.

మిగిలిన మొత్తం కోసం నగలను.. మంగళ సూత్రాన్ని సైతం తాకట్టు పెట్టి, సంతోష్‌రెడ్డికి ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం గ్యాంగ్‌ ప్లాన్‌ ప్రకారం ప్రభాకర్‌ టాక్సీని బివాండినుంచి ఏరోలికి బుక్‌ చేసుకుంది. మార్గం మధ్యలో తినడానికి అని చెప్పి కారు ఆపించింది. అనంతరం ప్రభాకర్‌ గొంతుకు నైలాన్‌ తాడు బిగించి హత్య చేసింది. ఎక్కడా వేలి ముద్రలు పడకుండా ఆ గ్యాంగ్‌ జాగ్రత్త పడింది. అయితే, విచారణలో శృతి పొంతనలేని సమాధానాలు చెప్పటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గట్టిగా అడగటంతో సుపారీ విషయం బయటపడింది. పోలీసులు సంతోష్‌రెడ్డి, శృతి, ప్రియ, హితేష్‌ వాలాలను అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top