పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చూస్తున్నారు?

What kids are watching online - Sakshi

సైబర్‌ క్రైమ్‌

ఎనిమిది, పదకొండేళ్ల వయసున్న ఇద్దరు అబ్బాయిలు ఆడుకోవడానికని వచ్చిన పక్కింటి అమ్మాయిని తమ దగ్గర ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లోని వీడియోలో చూసిన విధంగా ఉండాలని అడిగినందకు కాదంది. పైగా ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెబుతానని చెప్పడంతో భయపడిన అబ్బాయిలు ఆ అమ్మాయిపై రాళ్లతో దాడి చేయడంతో చనిపోయింది. విచారించిన పోలీసులు వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చారు. పదకొండేళ్ల బాలుడి దగ్గర ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ అతని తండ్రిది.

ఆన్‌లైన్‌ క్లాసుల కోసం తండ్రి కొడుక్కి ఇచ్చిన స్మార్ట్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉండటం.. వాటిని చూడటానికి అలవాటుపడిన పిల్లవాడు చేసిన నేరం తాలూకు పరిణామం ఇది. అస్సాంలోని నాగావ్‌ జిల్లాలో ఇటీవల జరిగిన ఈ సంఘటన పిల్లలున్న తల్లిదండ్రులంందరినీ పునరాలోచించుకునేలా చేసింది. ఆన్‌లైన్‌లో లభ్యమయ్యే అశ్లీల, హింసాత్మక కంటెంట్‌ దుష్ప్రభావాలకు పిల్లలు గురికాకుండా కుటుంబం దిశానిర్దేశం చేయాల్సిన అవసరాన్ని ఈ సంఘటన తెలియజేస్తోందని నాగావ్‌ ఎస్పీ ఈ సందర్బంగా తెలిపారు.

పిల్లలు ఆరుబయట నలుగురితో కలిసి ఆడుకునే రోజులు చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు చాలా వరకు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లు, మెసేజింగ్‌ రూమ్‌లు, వర్చువల్‌ వరల్డ్‌లు, బ్లాగుల్లోనే కలుస్తున్నారు. ఆటలైనా, పాటలైనా, వినోదం ఏదైనా.. అన్నీ ఇంటర్‌నెట్‌లోనే. ఇలాంటప్పుడు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అనేక ప్రతికూలతలనూ పిల్లలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని ఆన్‌లైన్‌లో మీ పిల్లల భద్రత గురించి ఆలోచించడమూ అత్యంత ముఖ్యం.

తెలుసుకోవాల్సిన నాలుగు స్తంభాలు
పిల్లవాడు ముందుగా ఫోన్‌లో లేదా కంప్యూటర్‌లో గేమ్‌ ఆడుకోవాలని మారాం చేస్తాడు. గేమ్‌ కదా అని ఇంటర్‌నెట్‌ వ్యవస్థని పిల్లల చేతిలో పెడితే అది పెద్దలకే ముప్పు కలిగించవచ్చు. గతంలో ఓ పిల్లవాడు వీడియో గేమింగ్‌కు అలవాటుపడి తల్లి క్రెడిట్‌ కార్డుల నుంచి రూ.16 లక్షల వరకు ఖర్చు చేసిన విషయం కూడా మనకు తెలుసిందే. ఇంటర్నెట్‌ ఉన్న ఎలక్ట్రానిక్‌ పరికరాలను పిల్లలకు బహుమతిగా ఇవ్వడం, ఇచ్చింది లాగేసుకోవడమూ రెండూ చేయకూడదు. అలాగే ఇచ్చేసి వదిలేయకూడదు. పిల్లలతో పాటు ఆన్‌లైన్‌ ట్రావెలింగ్‌ చేయలేకపోతే డిజిటల్‌ పరికరాలను అస్సలు ఇవ్వకూడదు. డిజిటల్‌ వేదికల మీదకు పిల్లలను తీసుకువచ్చినప్పుడు వారికి ప్లే సేఫ్, సేఫ్‌ సెర్చ్, పేరెంటల్‌ కంట్రోల్, ఫ్యామిలీ ఇ–మెయిల్‌ .. ఈ నాలుగూ నాలుగు స్తంభాలని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇ– మెయిల్‌ ఐడీ తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉన్నదైతే సమస్యను అర్థం చేసుకోవడానికి మార్గం సులువవుతుంది.

పర్యవేక్షణ అవసరం
మన శ్రేయస్సుకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా నేర్చుకోవాలో పిల్లలకు నేర్పడంలో తల్లిదండ్రులు వారికి సాయపడాలి. అందుకు పిల్లలతో కలిసి ఆన్‌లైన్‌ చూడటం, అందులో తమదైన కంటెంట్‌ను కలిసి సృష్టించడమనేది అలవాటు చేయాలి. అనేక సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, వెబ్‌సైట్‌ సాధనాలు 13 ఏళ్ల వయసు గల పిల్లలకూ యాక్సెస్‌ ఇస్తున్నాయి. అందుకని, పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో, చూస్తున్నారో తల్లిదండ్రులకు చెప్పాలి. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆన్‌లైన్‌ స్నేహాలను ప్రోత్సహించవద్దు.

ఆన్‌లైన్‌ స్నేహితులు చెప్పే ప్రతీదాన్ని నమ్మవద్దు అని చెప్పాలి. తమ పూర్తి పేరు, చిరునామా, ఫోన్‌ నెంబర్, రోజువారీ ప్రణాళికలు, పుట్టినరోజులు.. వంటి వ్యక్తిగత సమాచారాన్ని పిల్లలు గోప్యంగా ఉంచేలా ముందే జాగ్రత్తపడాలి. తమ టీచర్లు, కుటుంబం, స్నేహితులు చూడకూడదనేవాటిని ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్‌ చేయవద్దని చెప్పాలి. ఆన్‌లైన్‌లో వచ్చిన ప్రతిదాన్ని నమ్మవద్దని చెప్పాలి. సైబర్‌ బెదిరింపులు వంటివి ఉంటే తప్పక తెలియజేయమనాలి. ఇ–మెయిల్‌ ఐడీ, యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌.. వంటివి ఇతరులకు చెప్పవద్దని సూచించాలి. ఆఫ్‌లైన్‌లో ఏవిధంగా ఉంటారో, ఆన్‌లైన్‌లోనూ అంతే మర్యాదగా ఉండాలని బోధించాలి.

టీనేజర్లయినా .. నిబంధనలు తప్పనిసరి
పేరెంటల్‌ కంట్రోల్‌ తప్పనిసరి. అలాగే, ఏ తరహా వెబ్‌సైట్లు చూడకూడదో ముందే సెట్‌ చేసుకోవడానికి ఫిల్టరింగ్‌ సాఫ్ట్‌వేర్స్‌ ఉంటాయి. డబ్బులున్నాయి కదా అని ఈ వయసు పిల్లలకు మనీ ఎలా ఇవ్వకూడదో.. ఆన్‌లైన్‌లో జరిగే రకరకాల ప్రమాదాల గురించి చెప్పకుండా, పర్యవేక్షణ లేకుండా గ్యాడ్జెట్లు అలా ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోవాలి. పెద్దలు ఉపయోగించే స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్లు పిల్లలు కూడా ఉపయోగించేటప్పుడు కొన్ని వెబ్‌సైట్లు, యాప్స్‌ యాక్సెస్‌ని పరిమితం చేయచ్చు. లేదంటే అభ్యంతరకరంగా అనిపించిన ఫంక్షన్స్‌ని స్విచ్డాఫ్‌ చేసి ఉంచవచ్చు. సెర్చింగ్‌ ప్రక్రియలో సురక్షిత విధానాలు ప్రతిదానికీ ఉంటాయి. కొన్ని యాప్‌ అప్లికేషన్స్‌ని సైన్‌ఔట్‌ చేసి ఉంచచ్చు. ఈ నిబంధనలు పాటించడం ద్వారా పిల్లలు అనుచితమైన కంటెంట్‌ను చూసే ప్రమాదం తప్పుతుంది.

క్రమం తప్పకుండా ఇంటర్నెట్‌ గురించిన అవగాహన తీసుకువస్తే తప్ప పిల్లల స్థాయి దారుణాలు జరగకుండా కాపాడుకోవచ్చు. అలాగే ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు ఏం చేయాలో కూడా సిద్ధంగా ఉండాలి. పిల్లల్ని ఇబ్బందిపెట్టేది ఏదైనా ఇంటర్నెట్‌లో కనిపిస్తే ఏం చేయాలో వారితోనే మాట్లాడాలి. పిల్లలు ఇంటర్‌నెట్‌లో వర్క్‌ చేస్తున్నప్పుడు పెద్దలు వస్తే ల్యాప్‌టాప్‌ మూసేయడం, స్త్రీన్‌ ఆఫ్‌ చేయడం వంటివి చేయకూడదనే విషయాలు కఠినంగానైనా చెప్పాలి. ఇతరులు పంపిన క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం/ ఇతరులకు యుపిఐ/పిన్‌/ఓటీపీ వంటివి షేర్‌ చేయడం వల్ల డబ్బు, వ్యక్తిగత డేటా అపరిచితుల చేతుల్లోకి వెళుతుందని ముందే పిల్లలను నేర్పాలి. సురక్షితం అని భావించినప్పుడే పిల్లలను డిజిటల్‌ లోకంలోకి అనుమతివ్వడం అన్ని విధాల శ్రేయస్కరం.

అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్,
ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top