భార్యా భర్త.. మధ్యలో ఓ అక్క!.. షాకింగ్‌ విషయాలను రాబట్టిన పోలీసులు

Three Members Of Same Family Were Arrested For Fraud Chittoor District - Sakshi

చిత్తూరు అర్బన్‌: తెలిసిన వాళ్లు, స్నేహితులు, అయినవాళ్లు ఇలా అందర్నీ నమ్మించి మోసం చేయడం, వాళ్ల వద్ద ఉన్న కార్లను ఇప్పుడే తెచ్చిస్తామంటూ అమ్మేయడం.. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నిందితులను చిత్తూరు టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో చిత్తూరు నగరం దుర్గానగర్‌ కాలనీకు చెందిన డి.యుగంధర్‌ (42), డి.అనిత (35) దంపతులతోపాటు యుగంధర్‌ అక్క వై.మంజుల (43) ఉన్నారు.

బుధవారం చిత్తూరు పోలీసు అతిథిగృహంలో డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ నరసింహరాజు వివరాలను మీడియాకు వివరించారు.  దుర్గానగర్‌ కాలనీకి చెందిన యుగంధర్‌ యాక్టింగ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎవరైనా కార్లు అద్దెకు అడిగితే ట్రావెల్స్‌ వద్ద, తెలిసినవాళ్ల వద్ద ఉన్న కార్లను తీసుకెళ్లేవాడు. అయితే విలాసాలకు అలవాటుపడ్డ యుగంధర్, ఇతని అక్క మంజుల, భార్య అనిత కలిసి కొంతకాలంగా తెలిసినవాళ్లు, స్నేహితుల కార్లను ఇప్పుడే ఇస్తామని చెప్పి తీసుకెళ్లి, విక్రయించి, తప్పించుకుని తిరుగుతున్నారు.

ఇలా కార్లు ఇచ్చి మోసపోయిన బాధితులు చిత్తూరులోని సంతపేటకు చెందిన జనార్దన్, చవటపల్లెకు చెందిన ఢిల్లీ, గంగనపల్లెకు చెందిన ప్రసాద్‌ ఇటీవల పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. తమ కార్లను అద్దెకు తీసుకున్న యుగంధర్‌ తిరిగి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కార్లను అద్దెకు తీసుకున్న తరువాత వాటిని తాకట్టుపెట్టడం, కొన్నిసార్లు మంచి ధరకు అమ్మిస్తానని చెప్పి, కార్లను విక్రయించేసి, డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

బుధవారం నగరంలోని కాజూరు కూడలి వద్ద ఎస్‌ఐ మల్లికార్జున తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా యుగంధర్‌ కారులో చిత్తూరు వైపు వస్తూ.. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇతడ్ని వెంబడించి పట్టుకున్న పోలీసులు అసలు విషయాలు రాబట్టారు. తన భార్య, అక్కతో కలిసి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు యుగంధర్‌ పోలీసులకు చెప్పడంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీళ్ల నుంచి రెండు స్విఫ్ట్‌ డిజైర్, ఓ ఇన్నోవా కారును పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో తాలూక ఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి: ష్‌.. గప్‌చుప్‌..!!.. యువతులు దుస్తులు మార్చుకునే దృశ్యాల చిత్రీకరణ   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top