బార్‌పై టీడీపీ శ్రేణుల దాడి... | TDP ranks attacked the bar | Sakshi
Sakshi News home page

బార్‌పై టీడీపీ శ్రేణుల దాడి...

Jun 8 2024 5:53 AM | Updated on Jun 8 2024 5:53 AM

TDP ranks attacked the bar

రూ.1.40లక్షల మద్యం అపహరణ

నరసరావుపేటలో ఘటన.. 

ఎమ్మెల్యేతో మాట్లాడుకున్న తర్వాతే వ్యాపారం చేయాలని హెచ్చరిక

బార్‌ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట శివారు జొన్నలగడ్డ రోడ్డులో తాను నిర్వహిస్తున్న పల్నాడు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌పై టీడీపీకి చెందిన వ్యక్తులు దాడిచేసి రూ.1.40 లక్షల విలువైన మద్యం అపహరించారని బార్‌ యజమాని, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు షేక్‌ నూరుల్‌ అక్తాబ్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. బార్‌కు బలవంతంగా తాళాలు వేశారని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... ‘తొలుత గురువారం నాకు ఓ వ్యక్తి ఫోన్‌ చేసి నూతన ఎమ్మెల్యేతో మాట్లాడుకున్న తర్వాతే బార్‌ వ్యాపారం చేయాలని చెప్పారు. 

ఈ మేరకు నేను బార్‌కు తాళాలు వేసి వెళ్లాను. అనంతరం రాత్రి 10గంటల సమయంలో ఇద్దరు టీడీపీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో 20మంది బార్‌ వద్దకు వచ్చి తాళాలు పగులకొట్టి కౌంటర్‌లోని మద్యం బాటిళ్లను తీసుకెళ్లారు. అదే సమయంలో మీ యజమాని వచ్చి మా ఎమ్మెల్యేను కలవాలని వారు అక్కడున్న సిబ్బందిని హెచ్చరించారు. వారు వెంట తెచ్చుకున్న తాళాలను బార్‌కు వేసుకుని వెళ్లారు. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే బార్‌ వద్దకు వెళ్లి తాళాలను పరిశీలించి జిల్లా ఎస్పీ మలికాగార్గ్‌కు ఫోన్‌ చేసి విషయం తెలియజేశాను.’ అని షేక్‌ నూరుల్‌ అక్తాబ్‌ పేర్కొన్నారు. 

తాను ఎస్పీకి ఫోన్‌లో సమాచారం ఇచ్చిన వెంటనే రూరల్‌ సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐ రోశయ్య, పోలీసు సిబ్బంది వచ్చి పరిశీలించారని తెలిపారు. శుక్రవారం రూరల్‌ పోలీసు అధికారులు, క్లూస్‌టీమ్, ఎక్సైజ్‌ ఎస్‌ఈబీ సీఐ నయనతార, ఎస్‌ఐలు వచ్చి పంచనామా చేసి స్టాకు వివరాలు తనకు ఇచ్చారని చెప్పారు. తన ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement