Cyber Fraud: షాకింగ్.. ఓటీపీ లేకుండానే రూ.50 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు..

Man Loses Rs 50 Lakh After He Gets Missed Calls - Sakshi

మొబైల్‌కు వచ్చిన ఓటిపీ చెప్పమని అడిగి బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గురించి విన్నాం. కానీ ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో ఆన్‌లైన్ నేరగాళ్లు ఓటీపీ అవసరం లేకుండానే రూ.50 లక్షలు కొల్లగొట్టారు. కేవలం ఫోన్‌కు మిస్డ్‌ కాల్స్ ఇచ్చి బ్యాంకు ఖాతా నుంచి పలుమార్లు నగదు బదిలీ చేశారు. దీంతో బాధితుడు కంగుతిన్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

అక్టోబర్ 19న ఢిల్లీలోని ఓ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ ఎండీకి కొత్త నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. అదే నంబర్ నుంచి పదే పదే కాల్ వస్తోంది. కొన్ని సార్లు ఆయన కాల్ లిఫ్ట్ చేసినా అవతలి వ్యక్తి మాట్లాడలేదు. అయితే కాసేపటికే ఆయన బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షలు మాయమయ్యాయి. రూ.12లక్షలు ఒకసారి, రూ.10 లక్షలు ఒకసారి, రూ.4.6 లక్షలు ఒకసారి.. ఇలా పలుమార్లు ఆర్‌టీజీఎస్ ట్రాన్సాక్షన్ ద్వారా అతని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు ఇతర అకౌంట్లలలోకి వెళ్లిపోయాయి. దీంతో అతడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. 

'సిమ్ స్వాపింగ్' టెక్నిక్‌ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. నకిలీ సిమ్ కార్డు సృష్టించి దానితోనే లావాదేవీలు జరిపి ఉంటారని పేర్కొన్నారు. బహూశా జార్ఖండ్‌ జంతారాకు చెందిన నేరగాళ్లే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. నగదు బదిలీ అయిన అకౌంట్లు కూడా వాళ్లవి కాదని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top