పట్టపగలు డాక్టర్ దారుణ హత్య..!

ఇది బీజేపీ పాలన పుణ్యమే: అఖిలేశ్ యాదవ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. అచ్చె లాల్ వర్మ అనే వ్యక్తి ఓ డాక్టర్‌ని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇది హర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముద్రసన్ గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాధితుడు మునేంద్ర ప్రతాప్ వర్మ ముద్రసన్‌లోని తన క్లినిక్‌లో రోగులను పరీక్షిస్తున్నాడు. ఆ సమయంలో నిందితుడు అచ్చె లాల్ క్లినిక్‌లోని ప్రవేశించి కత్తితో దాడి చేశాడు.
నిందితుడు మొదట డాక్టర్ చేతిపై గాయం చేశాడు.. ఆపై అతని తల, మెడపై పొడిచి గాయాలు చేశాడు. అయితే డాక్టర్ ఎలాగోలా సహాయం కోసం తన క్లినిక్ తలుపు తెరిచాడు. స్థానికులు ఘటన స్థలానికి చేరుకునే సమయానికి, అధిక రక్తస్రావం కావడంతో డాక్టర్ మరణించాడు. ఇక పోలీసు సూపరింటెండెంట్ ఆర్‌పి సింగ్ మాట్లాడుతూ.. భూ ఒప్పందంలో బదిలీ చేయాల్సిన డబ్బుకు సంబంధించిన కొన్ని తగాదాలే హత్యకు దారితీసినట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు.
ఇది బీజేపీ పాలన పుణ్యమే..!
ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఈ ఘటనతో రాష్ట్రం భయభ్రాంతులకు గురైందన్నారు. ఘటనా స్థలానికి కొద్ది దూరంలో పోలీసు పికెట్ ఉన్నప్పటికీ, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని విమర్షించారు. ఇది బీజేపీ ప్రభుత్వ పాలనలో నేరస్థుల ఎలా చెలరేగిపోతున్నారో అద్దం పడుతుందని దుయ్య బట్టారు. యూపీలో శాంతిభద్రతలు ఎటు పోతున్నాయని ప్రశ్నించారు.