కంప్యూటర్స్‌ చదివి.. మోసాలలో ఆరితేరి.. 

Man Arrested For ATM Card Frauds In West Godavari - Sakshi

ఏటీఎం మోసగాడు అరెస్ట్‌

రూ.41.68 లక్షల సొత్తు స్వాధీనం  

ఏలూరు టౌన్‌ (పశ్చిమగోదావరి): కంప్యూటర్‌ చదువుకున్నాడు.. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో ఆరితేరిపోయాడు.. ఇంకేముంది సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో మోసాలకు పాల్పడుతున్నాడు.. ఏటీఎం కేంద్రాల వద్ద ఏటీఎం కార్డులను మారుస్తూ, ట్యాంపరింగ్‌ చేస్తూ సొమ్ములు కాజేస్తున్నాడు. ఐదు జిల్లాల్లో  42 కేసుల్లో నిందితుడిగా ఉన్న మోసగాడిని కొవ్వూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతడి నుంచి భారీగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏటీఎం మోసగాడిని అరెస్టు చూపుతూ జిల్లా ఎస్పీ కె.నారాయణనాయక్‌ గురువారం వివరాలు వెల్లడించారు.

తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం గ్రామానికి చెందిన పళ్ల సురేంద్రకుమార్‌ బీకాం కంప్యూటర్స్‌ చదివి కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో నైపుణ్యం సంపాదించాడు. విలాసాలకు అలవాటుపడిన సురేంద్రకుమార్‌ ఏటీఎం కేంద్రాల వద్దకు నగదు డ్రా చేసేందుకు వచ్చిన వారిని ఏమార్చి కార్డులను మార్చివేయడం, టాంపరింగ్‌ చేయడంలో సిద్ధహస్తుడిగా మారాడు. కార్డుల పిన్‌ నంబర్లు తెలుసుకుని షాపింగ్‌ మాల్స్, జ్యూయలరీ షోరూమ్‌లకు వెళ్లి వస్తువులు కొనుగోలు చేస్తుంటాడు. అతడిపై కృష్ణా, ఉభయగోదావరి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 42 కేసులు ఉన్నాయి.

కొవ్వూరు పోలీసుల చాకచక్యం
కొవ్వూరులో ఓ వ్యక్తిని ఏమార్చి ఏటీఎం కార్డును మార్చివేసి డబ్బులు డ్రా చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన సంఘటనపై సురేంద్రకుమార్‌పై టౌన్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై జిల్లా ఎస్పీ నారాయణనాయక్‌ ఆదేశాల మేరకు కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్‌ ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలు చాకచక్యంగా విచారణ చేసి రాజమండ్రి తాడితోటలో సురేంద్రకుమార్‌ నివాసముంటున్న చోట అతడిని అరెస్ట్‌ చేశా రు. అతని నుంచి రూ.18.53 లక్షల నగదు, రూ.23 లక్షల విలువైన 450 గ్రాముల బంగారు, రూ.15 వేల విలువైన 200 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసు అధికారులకు రివార్డులు 
నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన కొవ్వూ రు టౌన్‌ సీఐ ఎంవీవీఎస్‌ఎన్‌ మూర్తి, టౌన్‌ ఎస్‌ఐ కేవీ రమణ, సీసీఎస్‌ ఎస్సై రవీంద్రబాబు, ఎస్‌బీ హెచ్‌సీ పీవీ సత్యనారాయణ, పీసీలు జి.తమ్మా రావు, జీవీఎన్‌వీ అనిల్‌కుమార్, అఫ్సారీ బేగ్‌ను జిల్లా ఎస్పీ నారాయణనాయక్‌ అభినందిస్తూ నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, కొవ్వూరు డీఎస్పీ బీ.శ్రీనాథ్, సీసీఎస్‌ డీఎస్పీ జీవీఎస్‌ పైడేశ్వరరావు ఉన్నారు.
చదవండి:
భక్తి ముసుగులో మహిళలను లోబర్చుకుని...    
హత్యా..ఆత్మహత్యా?: బాలిక అనుమానాస్పద మృతి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top