
హోటల్లో అందరూ చూస్తుండగానే చంద్రశేఖర్ గురూజీపై కత్తిపోట్లతో విరుచుకుపడ్డారు దుండగులు. దీంతో తీవ్ర గాయాలపాలై ఆయన చనిపోయారు. హుబ్బళ్లి జిల్లాలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఈ దారుణ ఘటన జరిగింది.
కర్ణాటకకు చెందిన వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీని ఇద్దరు దుండగులు దారుణంగా హత్య చేశారు. హోటల్‌లో అందరూ చూస్తుండగానే ఆయనపై కత్తిపోట్లతో విరుచుకుపడ్డారు. దీంతో తీవ్ర గాయాలపాలై ఆయన చనిపోయారు. హుబ్బళ్లి జిల్లాలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. సీసీటీవీలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి.
భక్తులమని చెప్పి ఇద్దరు వ్యక్తులు చంద్రశేఖర్ అంగఢీ ఉన్న హోటల్‍కు వెళ్లారు. రెసెప్షన్‍లో ఉన్న వీళ్లను కలిసేందుకు ఆయన కిందకు వచ్చారు. వారితో మాట్లాడేందుకు కుర్చీలో కూర్చుకున్నారు. ఇంతలోనే ఇద్దరిలో ఒక వ్యక్తి ఆశీర్వాదం కావాలని చెప్పి గురూజీ కాళ్ల మీదపడ్డాడు. మరో వ్యక్తి తెల్లటి వస్త్రంలో తెచ్చిన కత్తి తీసి చంద్రశేఖర్‍పై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనేకసార్లు పొడిచాడు. మరో నిందితుడు కూడా గురూజీపై కత్తిపోట్లతో విరచుకుపడ్డాడు. అనంతరం ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది.
కొంతమంది హోటల్ సిబ్బంది దాడిని ఆపేందుకు ప్రయత్నం చేయగా.. ఇద్దరు నిందితులు వాళ్లను బెదిరించారు. దీంతో వారు భయపడిపోయి వెనక్కివెళ్లారు. ఈ ఆకస్మిక దాడిని చూసి హోటల్ రిసెప్షనిస్ట్ భయంతో అక్కడి నుంచి పారిపోయింది. మరికొందరు మాత్రం చూస్తూ ఉండిపోయారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందుతుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలిపారు. చంద్రశేఖర్ అంగఢీ కర్ణాటక బాగల్‌కోట్ జిల్లాలో నివసిస్తారు. వ్యక్తిగత పనిమీద హుబ్బళ్లి హోటల్‍లో ఉన్నప్పుడు దండగులు ఆయనపై దాడి చేసి హతమార్చారు.