హారతి ఆరిపోయింది.. కుంకుమ భరిణె కిందపడింది.. 

Kabitha Suicide At Banjarahills Hyderabad - Sakshi

ఆయుష్షు తీరిందని.. సెల్ఫీ వీడియో ఆన్‌చేసి..

ఫ్యాన్‌కు ఉరేసుకొని మహిళ ఆత్మహత్య 

కేసు దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు

సాక్షి, బంజారాహిల్స్‌: దేవుడికి హారతి ఇస్తుండగా మధ్యలోనే హారతి ఆరిపోయింది.. దేవుడికి బొట్టు పెట్టేందుకు కుంకుమ భరణె చేతులోకి తీసుకోగానే అది చేతులో నుంచి జారి కిందపడిపోయింది. దీంతో తనకు ఆయుష్షు మూడిందని భావించిన ఓ వివాహిత సెల్ఫీ వీడియో ఆన్‌చేసి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌కు చెందిన ఓంప్రకాశ్, కబిత తమ నాలుగేళ్ల కూతురుతో కలిసి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.78లోని పద్మాలయ అంబేడ్కర్‌నగర్‌ బస్తీలో అద్దెకుంటున్నారు. ఈ నెల 2వ తేదీన ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఓంప్రకాశ్‌ తాను డ్రైవింగ్‌ చేసే చోటకు కూతురిని తీసుకొని వెళ్లిపోయాడు.

రాత్రి 7.30 గంటలకు డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చి తలుపుతట్టగా భార్య ఎంతకూ తలుపు తీయలేదు. కిటికీలో నుంచి లోనికి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఇంటి యజమాని సహాయంతో తలుపులు తీసి చూడగా అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. అక్కడే ఉన్న సెల్‌ఫోన్‌ చూడగా ఆన్‌లోనే ఉంది. సెల్‌ఫోన్‌లో వీడియో ఆన్‌చేసి ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా అంతకుముందు హారతి ఆరిపోవడాన్ని, కుంకుమ భరణి కిందపడిపోవడాన్ని సైగలతో చూపించి తనకు ఆయుష్షు తీరిపోయిందని చెప్పినట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top