జీరో దందాలకు అడ్డాగా ‘గద్వాల’.. కిలోల్లో బంగారం.. | Gold Smuggling In Gadwal | Sakshi
Sakshi News home page

జీరో దందాలకు అడ్డాగా ‘గద్వాల’.. కిలోల్లో బంగారం..

Jul 7 2021 10:12 AM | Updated on Jul 7 2021 10:55 AM

Gold Smuggling In Gadwal - Sakshi

స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, వ్యాపారి హీరాబేగ్‌  

సాక్షి, గద్వాల: జీరో దందాకు కేరాఫ్‌ అడ్రస్‌గా నడిగడ్డ పేరు తెరపైకి వచ్చింది. ఏ వ్యాపారం చేయాలన్నా అక్రమార్కులు ముందుగా నడిగడ్డను ఎంచుకుంటున్నారు. పన్నులు ఎగ్గొట్టి దర్జాగా ధనం సంపాదించాలనే కుతూహలంతో జీరో దందా చేసే ముఠా గద్వాలలో పాగా వేశారు. తాజాగా మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన అల్‌ మీనా జ్యువెలర్‌ వర్క్‌ దుకాణానికి చెందిన కోట్ల హీరాబేగ్‌ ఎలాంటి అనుమతి లేకుండా 1.786 కిలోల (సుమారు రూ.66 లక్షల విలువజేసే) బంగారు ఆభరణాలను జిల్లాకేంద్రంలోని పలు దుకాణాల యజమానులకు విక్రయించేందుకు వచ్చాడు.

పక్కా సమాచారం మేరకు జిల్లా టాస్‌్కఫోర్స్‌ సీఐ జగదీష్‌గౌడ్, ఎస్‌ఐ నరేష్‌, సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించి హీరాబేగ్‌ను రాజవీధిలో అదుపులోకి తీసుకున్నారు. వాణిజ్య, కస్టమ్స్, సెంట్రల్‌ ట్యాక్స్‌ శాఖల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా బంగారాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అయితే గద్వాలలోనే దాదాపు 20 కిలోలకు పైగా బంగారాన్ని విక్రయించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం 1.786 కిలోల బంగారాన్ని మాత్రమే వాణిజ్య పన్నులశాఖకు అప్పగించారు.

ఈ విషయంపై జిల్లా వాణిజ్య పన్నులశాఖ అధికారి గోవర్ధన్‌ను మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతి, పన్నులు చెల్లించకుండా బంగారం విక్రయించేందుకు హీరాబేగ్‌ గద్వాలకు వచ్చినట్లు పోలీసులు గుర్తించి సమాచారం అందించారన్నారు. బంగారానికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున ఫెనాలీ్టగా రూ.4 లక్షలు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. సెంట్రల్, కస్టమ్స్‌శాఖకు నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. 

రెండు రాష్ట్రాలకు సరిహద్దు కావడమే.. 
రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో గద్వాల జీరో దందాలకు అడ్డాగా మారింది. ఆర్నెల్ల క్రితం కర్ణాటక పోలీసులు గద్వాలకు చెందిన ఓ వ్యాపారిని అరెస్టు చేసి రూ.20 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం పాఠకులకు విధితమే. ఇక్కడి వ్యాపారులే ఇతర రాష్ట్రాల వారితో ముఠాగా ఏర్పడి జీరో దందాను ప్రోత్సాహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

చర్యలు తప్పవు.. 
బంగారు ఆభరణాలు విక్రయించేందుకు వచ్చిన వ్యాపారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు సమాచారమివ్వగా వారు వచ్చి విచారణ చేపట్టి జీరో వ్యాపారంగా గుర్తించారు. ఆభరణాలను జప్తు చేశాం.. ఏవైనా అనుమతి పత్రాలుంటే సంబంధితశాఖ అధికారులకు చూపించి తీసుకెళ్లాలని సూచించాం. పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. జిల్లాలో అక్రమంగా బంగారం, ఇతరత్రా వ్యాపారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.    
– రంజన్‌రతన్‌ కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement