ఓ తల్లి పిచ్చిపని! బాలుడు కోసం పోలీసులను ఉరుకులు పెట్టించి..చివరికీ

Dead Body Of Child Gone Missing In Narasaraopet Thrown Into Well - Sakshi

సాక్షి, నరసరావుపేట/నరసరావుపేట రూరల్‌: నరసరావుపేటలో కనిపించకుండాపోయిన ఏడాది బాలుడు బావిలో శవమై తేలాడు. కిడ్నాప్‌ అయ్యాడని బాలుడి తల్లి ఫిర్యాదు చేయడంతో పరుగులు పెట్టిన పోలీసులు పట్టణంలోని 60 సీసీ కెమెరాలను పరిశీలించి.. కిడ్నాప్‌ జరగలేదని నిర్ధారించుకున్నారు. అనుమానంతో తల్లిని ప్రశ్నించగా.. పిల్లాడిని ఆడిస్తుండగా పొరపాటున బావిలో పడిపోయాడని తెలిపింది. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స తీసుకుంటోంది. బావి నుంచి బాలుడి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

అసలేం జరిగిందంటే.. 
పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం బండివారిపాలేనికి చెందిన బండి వాసు, సాయిలక్ష్మి దంపతులకు కుమార్తె మోక్ష, కుమారుడు భానుప్రకాష్‌ (1) ఉన్నారు. కాగా, వాసు, సాయిలక్ష్మి దంపతులు నరసరావుపేట శివారులోని బ్యాంక్‌ కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో తమ ఏడాది కుమారుడు భానుప్రకాష్‌ కనిపించడం లేదని తల్లి సాయిలక్ష్మి తన భర్త, బంధువులకు సమాచారం అందించింది. దీంతో తమ కుమారుడు కిడ్నాప్‌ అయ్యాడని తండ్రి వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వెంట్రుకలు కొనుగోలు చేసే వ్యక్తులు శుక్రవారం రెక్కీ నిర్వహించారని, శనివారం సాయంత్రం తమ బాబును అపహరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన వన్‌టౌన్‌ పోలీసులు ఘటన జరిగిన ప్రాంతం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కేసును తక్షణమే అక్కడికి బదిలీ చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్‌బీ సీఐ ప్రభాకర్‌ తమ సిబ్బందితో ఆ ప్రాంతంలో జల్లెడ పట్టారు. దాదాపు 60 సీసీ కెమెరాలను పరిశీలించగా.. బాలుడి ఆచూకీ ఎక్కడా నమోదు కాలేదు.

తల్లిని ప్రశ్నించడంతో.. 
బాలుడు భానుప్రకాష్‌ ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో బాలుడి తల్లి సాయిలక్ష్మిని రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ప్రహరీపై ఆడుకుంటున్న బాలుడు కిందకు జారి పాత బావిలో పడిపోయాడని సాయిలక్ష్మి తెలిపింది. ఈ విషయం చెబితే భర్త, బంధువులు ఏమంటారోనన్న భయంతో చెప్పలేదని భోరున విలపించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు బావిలో వెతకగా బాలుడి మృతదేహం లభించింది.

పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. బాలుడి తల్లి సాయిలక్ష్మి మానసిక స్థితి సరిగా లేదని పోలీసుల విచారణలో తేలింది. మొదటి కాన్పు సమయంలోనే ఆమె మానసిక సమస్య రావడంతో చికిత్స అందిస్తున్నట్టు భర్త తెలిపారు. నెల రోజుల క్రితం లక్ష్మి తల్లిదండ్రులు క్యాన్సర్‌ కారణంగా మృతి చెందినట్టు తెలిసింది. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో 15 రోజుల క్రితం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం చిన్నారి తన చేతుల్లో ఆడుకుంటూ కిందపడిపోవడంతో ఆమె భయపడి బాలుడు కనిపించడం లేదని భర్త, బంధువులకు చెప్పిందని ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు.

(చదవండి: అద్భుతాలు  చేస్తున్న అత్తోట రైతులు.. ప్రైవేటు రంగంలో తొలి విత్తన నిధి)

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top