
పామిడి(అనంతపురం): అప్పుల బాధ భరించలేక రామరాజుపల్లికి చెందిన భోగాతి బయపరెడ్డి (27), అనసూయ (25) దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. బయపరెడ్డి తనకున్న ఏడు ఎకరాలలో పత్తిపంట సాగు చేసేవారు. కొన్నేళ్లపాటు పంటలు చేతికందకపోవడంతో భారీగా నష్టం వచ్చింది. దీనికితోడు కుమార్తె పూజిత అనారోగ్యం బారినపడటంతో వైద్యం కోసం పలుచోట్ల అప్పులు చేయాల్సి వచ్చింది. బ్యాంకులో రూ.4లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.11 లక్షల దాకా అప్పులు ఉన్నాయి. వీటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో దంపతులిద్దరూ శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. పామిడి ఆస్పత్రిలో అనసూయ, అనంతపురం ఆస్పత్రిలో బయపరెడ్డి మృతి చెందారు. తల్లిదండ్రుల మృతితో మూడేళ్ల కుమారుడు అరుణ్‌కుమార్‌రెడ్డి, ఏడాది వయసున్న కుమార్తె పూజిత అనాథలయ్యారు.