రామోజీ, శైలజకు సీఐడీ నోటీసులు

AP CID serves notices on Ramoji, Sailaja in Margadarsi chit fund scam - Sakshi

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాల కేసులో విచారించనున్న అధికారులు

ఆర్థిక నేరాలకు కేరాఫ్‌గా మార్గదర్శి కేసులో దర్యాప్తు వేగవంతం  

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అక్రమ వ్యవహారాలకు సంబంధించిన కేసులో విచారించేందుకు సంస్థ చైర్మన్‌ చెరుకూరి రామోజీరావు, ఎండీ చెరుకూరి శైలజకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజను విచారించాల్సిన అవసరం ఉందని నిర్ధారించిన సీఐడీ వారిద్దరిని  ఈ నెల 29న గానీ 31న గానీ లేదా ఏప్రిల్‌ 3న గానీ 6న గానీ విచారించాలని నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో ముందుగా సమాచారం అందజేస్తూ వారికి అనువైన తేదీని తెలియచేయాలని సూచించింది. రామోజీరావు, శైలజ వారి నివాసంలోగానీ కార్యాలయంలోగానీ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. చిట్‌ఫండ్‌ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మా­ర్గ­దర్శి చిట్‌ఫండ్స్‌ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే.  

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్‌ ఫండ్స్, షేర్‌ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడైంది.

ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్‌విత్‌ 34, కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టం–1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసులో సీఐడీ అధికారులు నలుగురు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మేనేజర్లను అరెస్టు చేశారు. 

అదో ఆర్థిక నేర సామ్రాజ్యం...
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా మళ్లించడం ద్వారా రామోజీరావు యథేచ్ఛగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ చిట్‌ఫండ్స్‌ చట్టం–1982, రిజర్వ్‌బ్యాంకు చట్టం, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించారు. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో  స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్, నవంబ­ర్‌ నెలల్లో, హైదరాబాద్‌లోని ప్రధాన కార్యా­ల­యం­లో డిసెంబరులో నిర్వహించిన సోదాలతో ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది.

సొమ్ములు రాష్ట్రంలోని చందాదారులవి కాగా ఆర్థిక ప్రయోజ­నా­లు మాత్రం పొరుగు రాష్ట్రంలో మకాం వేసిన రామోజీరావువని వెల్లడైంది. రాష్ట్ర చందాదారుల కష్టార్జి­తానికి రక్షణ లేదని గుర్తించిన స్టాంపులు–­రిజిస్ట్రేషన్ల శాఖ దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూ­రు, విజయవాడ, గుంటూరు, నరసరావు­పేట, అనంతపురంలోని మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కార్యా­లయాల్లో సీఐడీ నిర్వహించిన సోదాల్లో మరి­న్ని అక్రమాలు బయటపడ్డాయి.

మరోవైపు స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా ఓ చార్టెడ్‌ అకౌంటెంట్‌ ద్వారా మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ ఆర్థిక నివే­దిక (ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌)లను పరిశీలించగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతోమంది చందాదారులు తాము మోసపోయినట్లు సీఐడీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మనీలాండరింగ్‌కు  పాల్ప­డి­¯­] ట్లు తేలడంతో ఈ అంశంపై దర్యాప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కు సీఐడీ 
నివేదించింది. 

మార్గదర్శిలో గుర్తించిన అక్రమాలు ఇవీ..
అక్రమ డిపాజిట్లు..
రిజర్వ్‌ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమ డిపాజిట్లను సేకరిస్తోంది. చందాదారులు పాడిన చిట్‌ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తంపై 4 శాతం నుంచి 5 శాతం వరకు చందాదారుడికి వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రశీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్‌ మొత్తాన్ని డిపాజిట్‌గా స్వీకరిస్తున్నట్టే.

చిట్‌ఫండ్‌ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడాన్ని చట్టం నిషేధించింది. అయినప్పటికీ మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ‘ ప్రత్యేక రశీదు’ ముసుగులో డిపాజిట్లు సేకరించింది. గతంలో కూడా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ పేరిట రూ.15 వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన చరిత్ర రామోజీరావుది. అదే తరహాలో ప్రస్తుతం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ముసుగులో అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారు. 

నిధుల మళ్లింపు.. అక్రమ పెట్టుబడులు
చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును అక్రమ పెట్టుబడులకు మళ్లించారు. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కార్యాల­యా­ల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్‌ రిస్క్‌ అత్య­ధికంగా ఉండే మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టు­బడిగా పెట్టింది. మార్గదర్శి చిట్స్‌ ప్రైవేట్‌ లిమి­టెడ్‌–చెన్నై, మార్గదర్శి చిట్స్‌ (కర్ణాటక) ప్రైవేట్‌ లిమిటెడ్‌–బెంగళూరు, ఉషాకిరణ్‌ మీడి­యా ప్రైవేట్‌ లిమిటెడ్‌– హైదరాబాద్‌లను అనుబంధ కంపెనీలుగా చూపిస్తూ నిధులను అక్రమంగా మళ్లించారు.

ఆ మూడు అనుబంధ కంపెనీల్లో రూ.1,05,80,000 పెట్టుబడి పెట్టిన­ట్టు బ్యాలెన్స్‌ షీట్‌లో చూపించారు. అయితే ఆ కంపెనీల షేర్‌ హోల్డర్స్‌ జాబితా పరిశీలించగా ఒక్క ఉషా కిరణ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లోనే 88.5 శాతం వాటాతో రూ.2 కోట్లు పెయిడ్‌ అప్‌ క్యాపిటల్‌గా పెట్టుబడి పెట్టినట్లు నిర్ధారణ అ­య్యిం­ది. బ్యాల­న్స్‌ షీట్‌లో నోట్‌ నంబర్‌ 7 కింద రూ.459.98 కోట్లు చూపించారు. అయితే ఆ మొ­త్తా­­న్ని నిబంధనలకు విరుద్ధంగా మ్యూచు­వల్‌ ఫం­డ్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు పరిశీ­ల­నలో వెల్ల­డైంది.

అందు­బాటులో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతా­లను పరిశీలించగా ఐసీఐసీఐ ప్రుడెని­్ష­యల్‌ మ్యూచు­వల్‌ ఫండ్స్‌లో మూడు­సార్లు రూ.29 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు చొప్పున, ఎడెల్‌­వైసీస్‌ ఆర్బిట్రేడ్‌ ఫండ్స్‌లో రూ.10 కోట్లు చొప్పు­న నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టి­నట్లు వెల్లడైంది. పూర్తి బ్యాంకు ఖాతాలను పరి­శీలిస్తే ఇంకా ఎన్ని పెట్టుబడులు పెట్టారో తెలుస్తుంది. 

పోంజీ తరహా మోసం..
రామోజీరావు పోంజీ (గొలుసుకట్టు) తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మార్గదర్శి సంస్థ చిట్టీలలో 30 శాతం నుంచి 40 శాతం టికెట్లు (సభ్యత్వాలు) యాజమాన్యం పేరిట ఉంచు  తోంది. ఆ టికెట్లకు చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. ఇతర చందాదారులు చెల్లించిన చందాలను తాము చెల్లించినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్‌ తీసుకుంటోంది. చందాదారుల సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోంది. 

చందాదారుల హక్కులకు విఘాతం
రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ తమ బ్రాంచిల్లో చందాదారులు చెల్లించిన మొత్తాలను నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించింది. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ మేనేజర్లకు (ఫోర్‌మేన్‌) చట్టప్రకారం ఉండాల్సిన చెక్‌ పవర్‌తో సహా ఎలాంటి అధికారాలు లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్‌ పవర్‌ అంతా హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. రాష్ట్రంలో చందాదారులు చెల్లించిన మొత్తానికి బాధ్యులెవరని ప్రశ్నిస్తే సమాధానమే లేదు.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top