త‌గ్గ‌దేలే: పురుషుల‌కు స‌మానంగా,రూ.100లో రూ.85 మ‌హిళ‌లే సంపాదిస్తున్నారు

Women Executives Earn Rs 85 For Every Rs 100 Earned By Men - Sakshi

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం-ఏ) నిర్వహించిన స‌ర్వేలో ఆస‌క్తికర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఓ అధ్యయనం ప్రకారం మ‌న‌దేశంలోని మహిళా ఎగ్జిక్యూటివ్‌లు వారి పురుష సహచరులు సంపాదించే ప్రతి రూ.100కి సగటున రూ.85 సంపాదిస్తున్న‌ట్లు తేలింది. 
  
ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ  మాత్రమే ఆమె విధి...అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి పరిచయ వాక్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు..ఇంటా మేమే,బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు..వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. అంతెందుకు ఇటీవ‌ల నిర్వ‌హించిన ఓ స‌ర్వేలో మ‌న‌దేశంలో మహిళా ఎగ్జిక్యూటివ్‌లు వారి పురుష సహచరులు సంపాదించే ప్రతి రూ.100కి సగటున రూ.85 సంపాదిస్తున్న‌ట్లు తేలింది.  

ఇక్రా చైర్‌పర్సన్ అరుణ్ దుగ్గల్ ఆధ్వ‌ర్యంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం-ఏ) హెచ్ ఆర్ అసోసియేట్‌ప్రొఫెసర్ ప్రొమిలా అగ‌ర్వాల్ 'ది గ్లాస్ సీలింగ్- లీడర్‌షిప్ జెండర్ బ్యాలెన్స్ ఇన్ ఎన్‌ఎస్‌ఈ 200 కంపెనీస్ పేరిట స‌ర్వే నిర్వ‌హించారు.  

గ‌తేడాది నేష‌న‌ల్ స్టాక్‌ ఎక్ఛేంజ్లో న‌మోదు చేసుకున్న 200 కంపెనీల్లోని 109కంపెనీలకు చెందిన సుమారు 4వేల కంటే ఎక్కువ మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయం ఆధారంగా నివేదికను త‌యారు చేశారు. ఆ నివేదిక‌లో దేశంలోని కంపెనీల టాప్, సీనియర్ మేనేజ్‌మెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం డైరెక్టర్ల బోర్డుల‌లో ఉండాల్సిన మహిళల శాతం కంటే గణనీయంగా తక్కువగా ఉందని తేలింది.  

సంస్థల సీనియర్ మేనేజ్‌మెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 7 శాతం మాత్రమేనని, ఇది టాప్ మేనేజ్‌మెంట్ స్థాయిలో కేవలం 5 శాతానికి దిగజారింది. అయితే, సర్వే ప్రకారం.. నియంత్రణ అవసరాల కారణంగా ఎన్ఎస్ఈలో న‌మోదైన 500 కంపెనీల్లో ఉన్నత స్థాయిలో ఉన్న మహిళా డైరెక్టర్ల సంఖ్య 2014లో 4.5 శాతం నుండి 2022 నాటికి 16 శాతానికి పెరిగింది.

200 సంస్థలలో 21 సంస్థల్లో టాప్ మేనేజ్‌మెంట్‌లో ఒక మహిళ మాత్రమే ఉండగా, 76 సంస్థల్లో టాప్ మేనేజ్‌మెంట్‌లో ఒక్క మహిళ కూడా లేరని కూడా ఇది హైలైట్ చేసింది.

మహిళా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య అత్యధికంగా ఉన్న పరిశ్రమలు వినియోగదారుల సేవలు, వినియోగ వస్తువులు, ఆర్థిక సేవలు, ఔషధాలు, సమాచార సాంకేతికత విభాగాలు ఉన్నాయ‌ని  సర్వేలో తేలింది.

నివేదికలో మహిళా ఎగ్జిక్యూటివ్‌లకు తీసుకునే జీతాలు రూ.1.91 కోట్లుగా ఉండ‌గా.. అదే స్థాయి హోదాలో ఉన్న వారి పురుష సహచరులు ఆర్జిస్తున్న జీతం రూ. 2.24 కోట్లుగా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top