ప్రకృతి సంపద దోచేస్తున్నారు
చంద్రబాబు సర్కారు పాలనలో ప్రకృతి సంపద దోచేస్తున్నారు. కొండలనే కాకుండా చెరువులనూ వదలకుండా మట్టిని అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కబ్జాదారుల ఆగడాలు ఎక్కువైపోయాయి. నిన్నేమో జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ఉండే కట్టమంచి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడ్డారు. రోజుకు వందల సంఖ్యలో మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలపై సాక్షిలో వరుస కథనాలు ప్రచురించింది. అలాగే ప్రజలు గ్రీన్‌ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయడంతో కట్టమంచి చెరువులో మట్టి తవ్వకాలు ఆగిపోయాయి. ఆ తర్వాత ప్రస్తుతం జిల్లా కేంద్రానికి సరిహద్దులో పలమనేరు రోడ్డులో ఇరువారం వద్ద జాతీయ రహదారికి పక్కనే ఉన్న కాజూరు చెరువులో మట్టి తవ్వకాలు ప్రారంభించారు. టీడీపీ మాజీ ఎంపీకి చెందిన పాఠశాలకు ఆనుకుని ఉన్న దారిలో వందల ట్రాక్టర్‌లలో మట్టిని ఇష్టానుసారంగా తరలిస్తున్నారు.


