పింఛన్‌ కోసం పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ కోసం పడిగాపులు

Nov 2 2025 9:36 AM | Updated on Nov 2 2025 9:36 AM

పింఛన్‌ కోసం పడిగాపులు

పింఛన్‌ కోసం పడిగాపులు

● పాత మున్సిపల్‌ ఆఫీసు వద్ద నిరీక్షణ ● ఎందుకు వచ్చారు?.. ఎవరు రమ్మన్నారు? ● లబ్ధిదారులను దబాయించిన సిబ్బంది

పుత్తూరు: పింఛన్‌ కోసం వృద్ధులు, దివ్యాంగులు పడరానిపాట్లు పడుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత, పాలకుల అలసత్వం వెరసి సచివాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితే పుత్తూరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక పాత మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో సత్యనారాయణ కాలనీ, దాసరిగుంట, అంబేడ్కర్‌ సర్కిల్‌ సచివాలయాలు ఉన్నాయి. ఈ మూడు సచివాలయాలకు సంబంధించి పలువురు వృద్ధులు శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు పడిగాపులు కాశారు. వీరిని పలకరిస్తే పింఛన్‌ తీసుకుంటేనే రోజూ పూట గడుస్తుందని కొందరు.. ఈ నెల మందులు కొనాలి అందుకు డబ్బులు కావాలంటూ మరికొందరు తమ బాధలు చెప్పుకొచ్చారు. ఇంటి వద్దకే వచ్చి పింఛన్‌ ఇస్తారు కదా? అని ప్రశ్నిస్తే.. అదీ ఏడాది క్రితం మాట నాయనా.. ఇప్పుడు సచివాలయం వద్దకు వస్తేనే పింఛన్‌ ఇస్తారని చెపుతుంటే ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఇక్కడ ఇచ్చారా అంటే?.. ఎందుకు వచ్చావంటున్నారు? రేపురా అంటున్నారు. ఏమి చేయాలో తెలియడం లేదు.. అంటూ ఓ దివ్యాంగుడు కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడి వారిని కలచివేసింది.

సమాచార లోపం..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీన ఇంటి వద్దకు వెళ్లి పింఛన్‌ అందజేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏ నెల ఎవరు? ఎక్కడ పింఛన్‌ ఇస్తారన్న విషయంపై ప్రభుత్వానికే స్పష్టత లేదు. ఒకనెల ఇంటి వద్ద ఇస్తే, మరోనెల సచివాలయానికి రండంటూ ప్రకటనలు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు నగదు ఎవరు..? ఎక్కడ ఇస్తారన్న దానిపై స్పష్టత లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో గత అక్టోబర్‌1న సచివాలయ సిబ్బంది సమ్మెలో ఉండడంతో కార్యాలయం వద్దకు వచ్చి పింఛన్‌ తీసుకెళ్లాలని చెప్పారు. అలా గత నెల సచివాలయాల వద్దకు వచ్చిన వృద్ధులు ఈనెల సైతం సచివాలయాల వద్దకు వచ్చేశారు. ఇక్కడి వచ్చాక ఎందుకు వచ్చారంటూ వారిని సిబ్బంది ప్రశ్నించడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement