అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం!
చౌడేపల్లె: ‘గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూటమి ప్రభుత్వ కుట్రలకు భయపడొద్దని.. ఎవరికి ఏ కష్టమొచ్చినా మేముంటాం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసానిచ్చారు. శనివారం మదనపల్లె పట్టణంలోని దేవతా నగర్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటికిషోర్‌బాబును చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప, ఎన్.శ్రీనాథరెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. ఇటీవల బైక్ ప్రమాదంలో కిషోర్‌బాబు కాలు విరిగింది. చికిత్సల అనంతరం ఆయన ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న పెద్దిరెడ్డి ఆయన్ను పరామర్శించారు. అనంతరం చౌడేపల్లె, పుంగనూరు మండలాల నుంచి అక్కడికి చేరుకున్న నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను దీటుగా ఎదుర్కొని ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో చేపట్టిన కోటి సంతకాల సేకరణపై ఆరా తీశారు. వైస్ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ నాగభూషణరెడ్డి, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, కో–ఆప్షన్ మెంబరు సాధిక్‌బాషా, డీసీసీబీ మాజీ డైరక్టర్ రమేష్‌బాబు, నాయకులు జి.శ్రీనివాసులరెడ్డి, రంగనాథ్, గిరిబాబు, చిన్నప్ప, మోహన్‌యాదవ్, శ్రీనివాసులు, కృష్ణప్ప, నారాయణరెడ్డి, విజయ్ పాల్గొన్నారు.


