నీచ సంస్కృతి
రోజురోజుకూ పెరుగుతున్న భ్రూణహత్యలు ఇష్టారాజ్యంగా స్కానింగ్ కేంద్రాలు ఆడ బిడ్డను కడుపులోనే చిదిమేస్తున్న ప్రయివేటు వైద్యులు పట్టనట్టు వ్యవహరిస్తున్న జిల్లా అధికారులు
సైన్స్, విద్య, క్రీడలు, వ్యాపారం, రాజకీయ రంగాల్లో మహిళలు విశేషంగా రాణిస్తున్నారు. మగవారిని మైమరపిస్తూ దూసుకుపోతున్నారు. ఒకవైపు అతివల విజయపరంపర ప్రపంచాన్ని శాసిస్తుంటే .. మరోవైపు ఆడ పిల్లల పుట్టుకపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. పుట్టబోయేది ఆడ పిల్ల అని తెలిస్తే చాలు గర్భంలోనే చిదిమేస్తున్నారు. కొందరు ప్రయివేటు వైద్యులు ఇష్టారాజ్యంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ అడ్డదారుల్లో భ్రూణ హత్యలకు కారకులవుతున్నారు. ఇలాంటి స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. భ్రూణ హత్యలపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్..
కాణిపాకం: ప్రస్తుత సమాజంలో ఆడ పిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. గర్భంలోని శిశువు ఆడపిల్ల అని తెలిస్తే చంపేసే దుష్ట సంస్కృతి నేటికీ కొనసాగుతోంది. ఓ వైపు అన్ని ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నియంత్రించినా.. అదనపు డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు వైద్యులు అడ్డదారుల్లో కేంద్రాలు నడుపుతూ శిశువుల ఊపిరి తీస్తున్నారు. ఇలాంటి వాటిని నియంత్రించాల్సిన జిల్లా అధికార యంత్రాంగం, వైద్యారోగ్య శాఖలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం విడ్డూరంగా మారింది. చిత్తూరు నగరంలో పదుల సంఖ్యలో ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే నగరి, పలమనేరు, కుప్పం, పుంగనూరు తదితర ప్రాంతాల్లో పుట్టగొడుగులా ప్రయివేటు స్కానింగ్ కేంద్రాలు వెలుస్తున్నా తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
మధ్యవర్తులతో దందా..
బాలికల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా... అవగాహనా రాహిత్యంతో ప్రస్తుత సమాజంలో అమ్మాయిలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. మరో వైపు బాలికల సంరక్షణ కోసం చట్టాలున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. జిల్లాలో పురుషులతో సమానంగా మహిళలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నా భ్రూణ హత్యలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. అయితే స్కానింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతులిచ్చేటప్పుడు కమిటీ సభ్యుల్లోని కొందరు ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి పరిశీలించడం తప్ప పర్యవేక్షణ చేయడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఈ విషయంలో పలు ప్రైవేటు ఆస్పత్రులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ మహిళల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. టీనేజీలు సైతం చిట్టితల్లులై అబార్షన్లకు వస్తున్నట్లు వైద్యులు గుర్తిస్తున్నారు. అబార్షన్లకు జిల్లా వాసులే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వాళ్లపై నిఘా ఎక్కడ?
జిల్లాలో మాతాశిశు సంరక్షణ కోసం కృషి చేయాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ, ఇతర అనుబంధ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. మొదటిసారి కుమార్తెను ప్రసవించి, రెండోసారి గర్భం దాల్చిన వారిపై ఎక్కువ నిఘా పెట్టాలి. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌న్‌ఎంలు, అంగనన్‌వాడీ కార్యకర్తలు సూపర్ వైజర్ల ద్వారా వివరాలు సేకరించి ఆన్‌న్‌లైనలో పొందుపరచాలి. అయితే ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని తెలుస్తోంది.
జిల్లా సమాచారం
అన్ని ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తూ 1994లోనే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చాయి. అయినప్పటికీ జిల్లాలో ఈ పరీక్షలు అడ్డదారుల్లో కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఇంకా తొలగిపోని కారణంగా గర్భిణులు పలువురు అర్హతలేని స్థానిక వైద్యులు, ఆస్పత్రుల సహకారంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకుని గర్భ విచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. కాసులకు కక్కుర్తి పడుతున్న వైద్యులు, పలు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టానుసారంగా లింగ నిర్ధారణ పరీక్షలకు మొగ్గు చూపుతున్నారు. గుట్టుగా ఎవరికీ తెలియకుండానే శిశువులను అమ్మ గర్భంలోనే చిదిమేస్తున్నారు.
జిల్లాలో అడ్డగోలుగా అబార్షన్లు
చట్ట ప్రకారం అమలు చేయాలి
పీసీపీఎన్‌డీటీ చట్ట ప్రకారం స్కానింగ్ సెంటర్లను నిర్వర్తించాలి. వైద్యర్హాత లేకుండా స్కానింగ్ చేసేవాళ్లపై కేసులు పెట్టాలి. నకిలీ డాక్టర్లు దొంగ చాటుగా అబార్షన్లు చేసేస్తున్నారు. అధికారులు వాళ్లను పట్టుకుంటే కొందరు నాయకులు అడ్డుపడుతున్నారు. అధికారులకు సహకరించి.. అబార్షన్ల కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. లేకుండా మహిళల సంఖ్య దారుణంగా పడిపోయే అవకాశాలున్నాయి.
– డాక్టర్ రవిరాజు, ఏపీ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఇన్ఫెక్షన్ రేటు పెరుగుతోంది
ఇష్టానుసారంగా అబార్షన్లు చేయించుకోవడం మంచిది కాదు. ఇన్ఫెక్షన్ రేటు పెరుగుతోంది. క్యాన్సర్‌కు కారణమవుతుంది. గర్భసంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా గర్భస్థ సమస్యలుంటే గుర్తింపు ఉన్న డాక్టర్లను సంప్రదించాలి. వారి అనుమతితో అబార్షన్లు చేసుకోవచ్చు. లేని పక్షంలో మాత్రలు, నాటు మందులతో అబార్షన్లు చేయిస్తారంటే వారి వద్దకు వెళ్లకండి. అబార్షన్ల పేరుతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి.
–ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వాస్పత్రి, చిత్తూరు
నీచ సంస్కృతి
నీచ సంస్కృతి
నీచ సంస్కృతి


