 
															అదే ఉత్కంఠ!
చిత్తూరు అర్బన్: చిత్తూరు మాజీ మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ జంట హత్యల కేసు చివరి అంకానికి చేరింది. దోషులు ఐదుగురుకి విధించే శిక్షపై శుక్రవారం తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. కోర్టు ఇవ్వనున్న తీర్పుపై అటు బాధిత కుటుంబాల్లో.. ఇటు దోషుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా దోషులైన చంద్రశేఖర్ (చింటూ), వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ, వెంకటేష్‌ను గురువారం మధ్యాహ్నం చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఇన్‌చార్జ్ న్యాయమూర్తి డా.ఎన్.శ్రీనివాసరావు ఎదుట హాజరుపరిచారు.
తీర్పుపై ఆసక్తి
జంట హత్యల కేసులో 21 మంది నిందితుల్లో 16 మందిపై కేసు కొట్టేయడం, ఐదుగురిపై నేరం రుజువైనట్లు ఇప్పటికే కోర్టు ప్రకటించింది. తీర్పు నేపథ్యంలో న్యాయస్థానం సుప్రీంకోర్టు నియమ నిబంధనలు పాటిస్తూ, దోషుల నుంచి పలు ప్రశ్నావళికి సమాధానాలు రాబట్టడం, వాళ్ల మానసిక పరిస్థితి తెలుసుకోవడం, చివరగా డిఫెన్స్, ప్రాసిక్యూషన్ వాదనలకు న్యాయస్థానం అవకాశం ఇచ్చింది. తుదిగా తీర్పు తేదీని ప్రకటించడంతో ఎలాంటి శిక్ష ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సుదీర్ఘంగా వాదనలు
దోషుల సామాజిక ప్రవర్తన, మానసిక పరిస్థితి, జైల్లో పరివర్తనలపై ఆయా శాఖల అధికారులు న్యాయస్థానానికి సీల్డు కవరులో నివేదిక అందచేశారు. అనంతరం దోషుల తరఫున డిఫెన్స్ వాదన ప్రారంభించారు. మరణశిక్షలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన పలు తీర్పులను న్యాయమూర్తి ఎదటు ఉదహరించారు. ఈ కేసులో దోషులకు మరణశిక్ష విధించే తీవ్రత లేదని, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను న్యాయస్థానానికి అందచేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన డిఫెన్స్ వాదనలు.. అర్ధగంట మినహా సాయంత్రం 6.40 గంటల వరకు కొనసాగాయి. అనంతరం ప్రాసిక్యూషన్ సైతం తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాక తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపై శుక్రవారం తీర్పును వెలువరిస్తామని న్యాయస్థానం చెప్పడంతో దోషులను చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
