 
															లేఖ రాసుకో..బహుమతి అందుకో!
చిత్తూరు కలెక్టరేట్ : స్టాంపుల సేకరణపై ఆసక్తిని పెంపొందించేందుకు దేశ వ్యాప్తంగా భారతీయ తపాలాశాఖ పోటీలను నిర్వహిస్తోంది. 2025–26 సంవత్సరానికి గాను దాయి అఖర్ ఉత్తరాల పోటీలను జాతీయ స్థాయిలో చేపడున్నారు. లెటర్ టు మై రోల్ మోడల్ అనే అంశం పై ఇంగ్లిష్, హిందీ, అన్ని ప్రాంతీయ భాషల్లో ఉత్తరాలు రాసేలా అవకాశం కల్పించారు. జిల్లాలో 18 ఏళ్ల లోపు, 18 ఏళ్లు దాటిన వారిని రెండు విభాగాలుగా విభజించి ఈ పోటీలను నిర్వహించనున్నారు.
చేతితో రాసిన లేఖలకే అనుమతి
ఇన్‌న్‌ల్యాండ్ లెటర్లపై చేతితో ఎన్వలప్ కేటగిరీలో 1000 పదాలకంటే ఎక్కువ ఉండకూడదు. ఇన్‌ల్యాండ్ లెటర్ కార్డ్ (ఐఎల్‌సీ) లో 500 పదాలకంటే ఎక్కువ ఉండకూడదు. చేతితో రాసిన లేఖలకు మాత్రమే అనుమతిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 8 తర్వాత పోస్ట్ చేసిన ఉత్తరాలు పోటీలో పాల్గొనేందుకు అంగీకరించరు. 18 సంవత్సరాల వరకు, 18 సంవత్సరాల పైబడిన వారు ఇన్‌ల్యాండ్ లెటర్ కార్డ్ కేటగిరీ, ఎన్వలప్ కేటగిరీల్లో పాల్గొనవచ్చు. ఇలా రాసిన ఉత్తరాలను ప్రధాన కార్యాలయమైన సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ చిత్తూరు–517001 చిరునామాకు పంపాల్సి ఉంటుంది. రాసే ఉత్తరాల్లో సంతకంతో పాటు వయసును రాయాలి. చిరునామాపైన ఎంట్రీ ఫర్ దాయి అఖర్ 2025–26 అని రాసి పోస్టు చేయాలి. ఈ పోటీలకు డిసెంబరు 8 వరకు గడువుంది.
బహుమతులు ఇలా..
జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిస్తే రూ.50 వేలు, ద్వితీయంలో నిలిస్తే రూ.25 వేలు, తృతీయ స్థానంలో నిలిస్తే రూ.10 వేలు ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన వారికి రూ.25 వేలు, ద్వితీయంలో నిలిస్తే రూ.10 వేలు, తృతీయంలో నిలిస్తే రూ.5 వేలు ఇస్తారు.
మంచి అవకాశం
లేఖలు రాసే ప్రతి ఒక్కరికీ ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకుని పోటీల్లో పాల్గొనాలి. ఉత్తరాలను స్పీడ్ పోస్టులో మాత్రమే పంపాలి. ఎన్వలప్ పై ఫిలాట్లీ స్టాంపులను వినియోగించవచ్చు. ప్రతి కేటగిరీలో మొదటి మూడు ఉత్తరాలు సర్కిల్ స్థాయిలో షార్ట్‌లిస్ట్ చేస్తాం. సర్కిల్ స్థాయిలో ఆ లేఖలకు బహుమతులను అందజేస్తాం.
– బి.లక్ష్మన్న, పోస్టల్ సూపరింటెండెంట్, చిత్తూరు పోస్టల్ డివిజన్
 
							లేఖ రాసుకో..బహుమతి అందుకో!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
