
అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా చంద్రశేఖర్
చిత్తూరు అర్బన్: చిత్తూరుకు చెందిన న్యాయవాది ఎం.చంద్రశేఖర్‌ను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. చిత్తూరులోని మొదటి అదనపు జిల్లా, సెషన్స్ న్యాయస్థానానికి ఈయన మూడేళ్ల పాటు ఏపీపీగా కొనసాగనున్నారు. ఇందుకోసం నెలకు రూ.40 వేల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నేషనల్ అవార్డ్స్‌కు
దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లు నేషనల్ అవార్డ్స్‌కు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2025 కు సంబంధించి జాతీయ పురస్కారాలు (నేషనల్ అవార్డ్స్)కు అర్హత, ఆసక్తి ఉన్న టీచర్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 13వ తేదీలోపు www.nationa lawardstoteacher.education.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని సెల్ఫ్ నామినేషన్ చేసుకోవాలన్నారు. అనంతరం హార్డ్ కాపీని డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు. ఫైనల్ సబ్‌మిషన్ ఆఫ్ సెల్ఫ్ నామినేటెడ్ ది టీచర్ చివరి తేదీ ఈనెల 15 అని ఆమె వెల్లడించారు.
జిల్లా ఓటర్లు 15,71,402
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూలై ఒకటవ తేదీ నాటికి 15,71,402 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మృతి చెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఓటర్ల జాబితా సిద్ధం చేసి రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఓటర్ల జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10,615 మందికి ఓటర్ ఎపిక్ కార్డులను పంపుతున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఆర్‌వో మోహన్‌కుమార్, పలు పార్టీల ప్రతినిధులు ఉదయ్‌కుమార్, సురేంద్రకుమార్, అట్లూరి శ్రీనివాసులు, వాడ గంగరాజు పాల్గొన్నారు.
మంజూరైన పనులు
చేయకపోతే రద్దు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా జెడ్పీ, 15వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం క్షేత్రస్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో జెడ్పీ, 15 వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. పనుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం ఉండకూడదన్నారు. జిల్లాలోని 31 మండలాల్లో చేపడుతున్న తాగునీరు, మురుగునీటి కాలువలు, సిమెంట్ రోడ్లు పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. నాణ్యతలో లోపం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంజూరై పనులు ప్రారంభం కాకపోతే రద్దు చేస్తామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నెలకు ఒకసారి ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయ్‌కుమార్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.