
బుల్లెట్ ట్రైన్.. భూసేకరణ షురూ!
● సచివాలయాల్లో ఎల్‌ఏ వివరాల ప్రదర్శన ● మార్కెట్ రేటుపై నాలుగురెట్లు ఎక్కువగా పరిహారం కోరుతున్న రైతులు ● నిర్ధారణ కాని అలైన్‌మెంట్లు
పలమనేరు : బుల్లెట్ ట్రైన్ మార్గానికి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 70 కి.మీలలో భూసేకరణ పనులు ఊపందుకున్నాయి. చైన్నె–బెంగళూరు– మైసూరు బుల్లెట్ ట్రైన్ మార్గానికి మూడు రాష్ట్రాల్లో 435 కిలోమీటర్లలో పనులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆ మేరకు జిల్లాలోని పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లోని బైరెడ్డిపల్లి, పలమనేరు, బంగారుపాళెం, గుడిపాల మండలాల్లోని ఈ మార్గం వెళ్లే గ్రామాలకు సంబంధించిన సచివాలయాల్లో భూములు కోల్పోనున్న రైతుల పేరు, సర్వే నంబరు, ఎంత మేర భూసేకరణ చేస్తారనే విషయాలను తెలుపుతూ నోటీసులను ప్రదర్శించారు.
కర్ణాటక రైతుల మాదిరిగానే పరిహారం
బెంగళూరు– చైన్నె ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కోసం గతంలో ఇదే ప్రాంతంలో రైతుల నుంచి భూములను సేకరించారు. ఇందులో చాలా మంది రైతులకు గిట్టుబాటు అవార్డు దక్కలేదని వారు న్యాయస్థానాలను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ (నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్) అధికారులు, కర్ణాటకలోని కోలారు డీసీ (డిస్ట్రిక్ కలెక్టర్) ద్వారా జరిపిన భూసేకరణ కార్యక్రమంలో అక్కడి రైతులు మార్కెట్ ధరపై నాలుగు రెట్లు ఎక్కువగా నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని భూములు కోల్పోయే రైతులు సైతం తమకు కర్ణాటక రైతులు తరహాలోనే తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
సచివాలయాల్లో పెట్టిన భూసేకరణ నోటీసులు
అలైన్‌మెంట్ల గందరగోళం
బుల్లెట్ ట్రైన్ కోసం ఇప్పటికే సర్వేకోసం హైవే మాగ్నిట్యూడ్ కంపెనీ, ట్రాఫిక్ కోసం పీకే ఇంజినీర్స్, అలైన్‌మెంట్ కోసం ట్రాన్స్‌లింక్, ఫైనల్ అలైన్‌మెంట్ కోసం ఆర్వీ అసోషియేట్స్, సర్వేకోసం సుబుది టెక్నాలజీస్, ఎస్‌ఐఏ కోసం ఓవర్‌సీస్ మిన్‌టెక్ కంపెనీలు పనులు చేపట్టారు. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటి దాకా రెండు అలైన్‌మెంట్లపై సర్వే చేపట్టారు. అయితే వీటిల్లో దేన్ని నిర్ధారిస్తారో ఇంకా సృష్టం కాలేదని సమాచారం.
భూసేకరణ వివరాలు ప్రదర్శన
పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలం కంభంపల్లి, గడ్డూరు, రామణపల్లి, గంగినాయనిపల్లి, బేలుపల్లి, పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి, సముద్రపల్లి, పెంగరగుంటల మీదుగా బంగారుపాళెం మండలంలోని గొల్లపల్లి, బోడబండ్ల, మహాసముద్రం, గుడిపాల మండలంలోని మాధవరం, జంగాళపల్లి, చిత్తూరు మండలంలోని ఇరువారం, కలెక్టర్ ఆఫీసు, గువ్వకల్లుల మీదుగా తమిళనాడులోకి బుల్లెట్ ట్రైన్ ప్రవేశిస్తుంది. ఈ గ్రామాలకు సంబంధించిన సచివాలయాల్లో ఇప్పటికే భూములు కోల్పోయే రైతుల పేర్లు, వారి మొత్తం విస్తీర్ణం, అందులో ఎల్‌ఏ విస్తీర్ణాలను తెలుపుతూ వివరాలను అక్కడి నోటీసు బోర్డులౖపై ప్రదర్శించారు. ఆ మేరకు జిల్లాలో 70 కిలోమీటర్ల మేర ఈ బుల్లెట్ ట్రైన్ మార్గం వెళ్లనుంది.

బుల్లెట్ ట్రైన్.. భూసేకరణ షురూ!