
18 ఏళ్ల సేవలపై వేటు !
పుత్తూరు : మున్సిపాలిటిలో 18 ఏళ్లుగా జనన, మరణాల చూసే రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికురాలు కృష్ణ జయంతిని ఎలాంటి తప్పు చేయకున్నా.. కేవలం కక్ష సాధింపుతో తొలగించి ఆమె జీవితాన్ని నడిరోడ్డు మీదకు లాగారు. గత నెల 8వ తేదీన కృష్ణ జయంతిని సెలవుపై వెళ్లాలని కమిషనర్ మంజునాథగౌడ్ ఆదేశించారు. తాను ఏదైనా తప్పు చేశానా? నన్ను రావొద్దనడానికి గల కారణాలను చెప్పాలని ఆమె ప్రాధేయపడింది. నాపై ఒత్తిడి ఉంది.. మళ్లీ చెప్పే వరకు ఆఫీసుకు రావద్దంటూ కమిషనర్ చెప్పడంతో ఆమె మౌనంగా వెనుదిరిగారు. ఇది జరిగి నెల కావస్తుండగా ఈ లోపు తిరిగి విధుల్లో చేరడానికి ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా ఫలితం శూన్యం. గేట్‌పుత్తూరుకు చెందిన జేసీబీ బాబు అనే వ్యక్తి తన కుటుంబంతో ఉన్న వ్యక్తిగత గొడవలకు రాజకీయ రంగు పులిమి తనను ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని జయంతి ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో సుమారు రెండు దశాబ్దాలుగా రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణజయంతిని విధుల నుంచి తప్పించడంపై ఏపీ మున్సిపల్ ఇంజినీరింగ్–టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు స్పష్టం చేశారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలగింపు!
రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకు కమిషనర్ చర్యలు
కక్ష సాధింపే కారణమంటున్న బాధితురాలు