
సిద్దంపల్లిలో చైన్ స్నాచింగ్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు మండలం సిద్దంపల్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు (తాళిబొట్టు గొలుసు) అపహరించారు. పోలీసుల వివరాల మేరకు ఇలా...సిద్దంపల్లి గ్రామానికి చెందిన వెంకటాద్రినాయుడు భార్య ధనలక్ష్మి ఇంటి బాల్కనీలో పడుకున్నారు. అర్ధరాత్రి వచ్చిన దొంగలు వీధిలైట్‌లు ఆఫ్ చేసి ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె మెడలో బంగారు గొలుసును చోరీ చేశారు. ఈ చోరీలో సగం గొలుసు మాత్రం దొంగ చేతికి చిక్కింది. ఇంతలో మంచంపై పడుకున్న బాధితురాలి కొడుకు కేకలు పెట్టడంతో మిగిలిన సగం గొలుసును వదిలి దొంగ గోడ దూకి పరారయ్యాడు. బాధితురాలు చిత్తూరు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా చోరీకి గురైన గొలుసు మొత్తం 27 గ్రాములు..అందులో సుమారు 10 గ్రాముల గొలుసు భాగాన్ని దొంగ చోరీ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.