
పూతలపట్టులో మాక్ డ్రిల్
పూతలపట్టు (కాణిపాకం): పూతలపట్టు మండలంలో శనివారం అడిషనల్ ఎస్పీ శివా నంద కిషోర్ పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. గ్యాస్ యూనిట్ వంటి కీలక ప్రదేశాల్లో ఉగ్రదాడులు జరిగినప్పుడు ఉద్యోగులు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, సైరన్లు మోగినప్పుడు అనుసరించాల్సిన భద్రతా ప్రోటో కాల్, బాంబు బెదిరింపుల సమయంలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ చర్యలు, అలాగే హెల్త్, ఫైర్ రె స్పాన్స్ టీమ్‌ల పాత్రను ఈ డ్రిల్‌లో ప్రాక్టికల్‌గా చూపించారు. ఐఓసీఎల్ వంటి ఇంధన సంస్థలు ఉగ్రవాదులకు లక్ష్యంగా మారే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలు అత్యంత కీలకమని పోలీసు అధికారులు పేర్కొన్నారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులు, ప్యాకెట్లు, పరికరాలను సిబ్బంది తాకకూడదని, వెంటనే పోలీసులకు లేదా బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డీఎస్పీలు సాయినాథ్, ఏఆర్ డీఎస్పీలు చిన్ని కృష్ణ, పూతలపట్టు సీఐ కృష్ణ మోహన్ తదిరతులు పాల్గొన్నారు.