చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఆధార్ నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని డీఆర్వో మోహన్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆధార్ నమోదు ప్రక్రియను ఎటువంటి తప్పులు లేకుండా కచితత్వంతో చేయాలని సంబంధిత అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ ఆదేశించారు. ప్రతి భారతీయ పౌరునికి ఆధార్ తప్పనిసరి అని చెప్పారు. ఆధార్‌తో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ఆధార్ ప్రధానంగా ఉందన్నారు. ఆధార్ నమోదులో పొరపాట్లకు తావులేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 2011 నుంచి ఆధార్ నమోదు నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందన్నారు. జిల్లాలో మొత్తం 226 ఆధార్ నమోదు కేంద్రాలున్నాయని చెప్పారు. అందులో 117 గ్రామ, వార్డు సచివాలయాలు, 7 ఈ సేవా కేంద్రాలు, 9 పోస్ట్ ఆఫీసులు, 9 బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసులు, 14 బ్యాంక్‌లు, 34 వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయల్లో ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. బయోమెట్రిక్ అప్‌డేషన్ నిరంతర ప్రక్రియగా ఉందన్నారు. 5 నుంచి 7 ఏళ్ల మధ్య వయసులో ఒకసారి, 15 –17 సంవత్సరాల మధ్యలో మరోసారి ఆధార్ అప్‌డేషన్ తప్పనిసరి అన్నారు. గత 30 రోజుల నుంచి 60,519 మందికి ఆధార్ నమోదు, అప్‌డేషన్ ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో డీఎల్‌డీఓ రవికుమార్, ఎల్‌డీఎం హరీష్, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, పోస్టల్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.