
పూలే విగ్రహానికి పూలమాల వేస్తున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్
చిత్తూరు కలెక్టరేట్ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మజ్యోతిరావు పూలే అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. గురువారం పూలే 198వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పీసీఆర్ సర్కిల్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలికలకు చదువు ఎంతో ముఖ్యమని గుర్తించిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు. 21 ఏళ్ల వయసులో అట్టడుగు వర్గాల బాలికల చదువు కోసం మొదటిసారిగా ఆయన 1848లో పాఠశాలను ప్రారంభించారన్నారు. చదువుతోనే మహిళలు ఆర్థికంగా, అన్ని రంగాల్లో రాణించగలరని చెప్పారు. దేశం ప్రగతి పథంలో పయనించాలంటే విద్య ఎంతో అవసరమని, తన కోసం జీవించడం కంటే సమాజం, దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మేధావి జ్యోతిరావు పూలే అని అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాజ్యలక్ష్మి, బీసీ కార్పొరేషన్, ఈడీ శ్రీదేవి, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.