
దూసుకుపోతున్న కోడె గిత్తలు
శ్రీరంగరాజపురం: యువత కేరింతలు... జనం చప్పట్లు... కోడె గిత్తల జోరుతో మండలంలోని ఉడలమకుర్తి పంచాయతీ ఎన్‌ఎండీ పురంలో ఆదివారం నిర్వహించిన ఎడ్ల పందేలు దుమ్మురేపాయి. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని ఎడ్ల పందేలు నిర్వహించడం ఆనవాయితీ. ముందుగా ఎడ్లకు పలకలు, బెలూన్‌లు కట్టి పందేనికి ఉసిగొల్పారు. అంతకు ముందే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న యువత అల్లి వద్ద పలకల కోసం నిలబడ్డారు. ఈలలు వేస్తూ తరిమిన కోడెగిత్తలు రంకెలేసుకుంటూ జనాలపై దూసుకుపోయాయి. ఎడ్లను నిలువరించి పలకలు పట్టేందుకు యువత పోటీ పడ్డారు. పలకలు పట్టిన యువత విజయ దరహాసంతో చిందులు వేశారు. అయితే కొన్ని ఎడ్లు జన ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా దూసుకెళ్లాయి. కొందరు ఎడ్ల కింద పడి గాయపడ్డారు. ఎడ్ల పందేలు కోలాహాలంగా సాగాయి.