
నిందితుడి అరెస్టు చూపుతున్న పోలీసులు
శాంతిపురం: ఉద్యోగం ఇస్తామని ఫోను ద్వారా నమ్మబలికి, బ్యాంకు అకౌంటులో ఉన్న సొమ్మును మోసపూరితంగా కాజేసిన ఢిల్లీకి చెందిన నిందితుడిని రాళ్లబూదుగూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ మునిస్వామి కథనం మేరకు వివరాలు.. చెంగుబళ్ల పంచాయతీలోని శివకురుబూరుకు చెందిన అమరావతి అనే మహిళ మొబైల్‌కు గత నవంబర్‌లో ఫార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాల పేరిట ఓ ఎస్‌ఎంఎస్ వచ్చింది. దానిని నమ్మిన ఆమె మెసేజ్‌లోని లింకు ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో భాగంగా ఆమె బ్యాంకు ఖాతా, యూపీఐ వివరాలను సేకరించిన దుండగులు ఆమె ఖాతా నుంచి రూ.1,73,000లను తమ ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు. తర్వాత వారి నుంచి స్పందన లేకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రాళ్లబూదుగూరు పోలీసులు విచారణ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎస్‌ఐ మునిస్వామి, కుప్పం ఎస్‌ఐ శివకుమార్, గుడుపల్లి ఎస్‌ఐ రామాంజనేయులుతో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటుచేశారు. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సాగిన విచారణలో మోసానికి పాల్పడిన వ్యక్తి దేశ రాజధానిలో ఉన్నట్టు గుర్తించారు. ఈనెల 25న అక్కడికి వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో నిందితుడు మోనూను అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టులో హాజరుపరచి, మేజిస్ట్రేటు అనుమతితో బుధవారం రాళ్లబూదుగూరుకు తీసుకువచ్చారు. కుప్పం కోర్టులో హాజరు పరచి మేజిస్ట్రేటు ఆదేశాల మేరకు రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోకుండా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.