● ముగ్గురికి తీవ్ర గాయాలు
వడమాలపేట : మండలంలోని వెంగళ్‌రాజుకండ్రిగ వద్ద తిరుపతి– చైన్నె జాతీయ రహదారిపై మంగళవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ రామాంజనేయులు కథనం మేరకు.. రాజస్థాన్‌కు చెందిన డేవిడ్, రాకేష్, దినేష్, డోలారామ్, రామ్‌నివాస్ తిరుపతిలోని అవిలాలలో నివసిస్తున్నారు. వీరు అక్కడే ఓ స్టీల్ దుకాణం నడుపుకుంటున్నారు. షాప్‌కు కావాల్సిన మెటీరియల్‌ను కొనుగోలు చేసేందుకు సోమవారం కారులో చైన్నెకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో ఉండగా ప్రమాదవశాత్తు కారు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. దీంతో దినేష్ అక్కడికక్కడే మరణించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రామ్‌నివాస్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురికీ ప్రస్తుతం రుయాలో వైద్యం అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.