జాబ్‌, బిజినెస్‌ మాకొద్దు.. సంపాదన మాత్రం లక్షల్లో.. ఆ గ్రామంలో అదే ట్రెండ్‌!

Youtube Earnings: This Small Village Youth Create Content For A Living Chhattisgarh - Sakshi

ప్రస్తుత రోజుల్లో గ్రాడ్యుయేట్లుగా కళాశాల నుంచి బయటకొస్తున్న విద్యార్థులు.. ఉద్యోగులుగా మారడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తుండగా.. మరి కొందరు ఐటీ రంగంలో ఇంజనీర్లుగా మారేందుకు కుస్తీ పడుతున్నారు. టీచర్లు, మార్కెటింగ్‌, వ్యాపారమంటూ.. విద్యార్థులు కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు చాలానే కష్టపడుతుంటారు. అయితే  ఏ ఉద్యోగం చేసిన సంపాదనే ధ్యేయంగా పని చేస్తుంటాం. ఈ విషయాన్ని గుర్తించిన ఓ గ్రామంలోని యువత జాబ్‌, వ్యాపారాలు చేయకుండానే సంపాదించేస్తున్నారు. అదెలాగో తెలుసుకుందాం

ఆ గ్రామంలో యువత ఎంచుకున్న దారి అదే
ట్రండ్‌ మారుతోంది.. అందుకు తగ్గట్టే యువత దృక్పథంలో కాస్త మార్పు కనిపిస్తోంది. అందుకే కేవలం ఉద్యోగాలనే కాకుండా ఆఫ్‌బీట్ కెరీర్‌ల వైపు కూడా ఓ లుక్కేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సోషల్‌మీడియా యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో యూట్యూబ్‌ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ ట్రెండ్‌నే ఫాలో అవుతోంది ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లోని తులసి గ్రామ యువత. గ్రామంలో నివసిస్తున్నప్పటికీ తమకున్న వనరులతో మంచి కంటెంట్‌ని రూపొందించి యూట్యూబ్‌ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ గ్రామంలో దాదాపు 400 పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామ జనాభా 3000-4000 మధ్య ఉండగా.. వారిలో 30 శాతం అనగా దాదాపు 1000 మంది యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు.

అలా మొదలైంది.. ఈ స్టోరీ
ఇద్దరు స్నేహితులు గ్రామంలో యూట్యూబ్ వీడియోలు చేయడం ప్రారంభించారు. యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించడం కోసం వీరిద్దరూ చేస్తున్న ఉద్యోగాలను సైతం వదులుకున్నారు. అందులో ఒకరు.. జ్ఞానేంద్ర శుక్లా ఎస్‌బిఐలో నెట్‌వర్క్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాదిస్తున్న యూట్యూబర్ల గురించి తెలుసుకున్నాడు. తాను ఆ దారిలో ప్రయాణించాలనుకుని, అనుకున్నదే తడవుగా జాబ్‌ రిజైన్‌ చేసి వీడియోలపై ఫోకస్‌ పెట్టాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు, అతను తన ఛానెల్‌లో 250 కంటే ఎక్కువ వీడియోలను అప్‌లోడ్‌ చేశాడు.

మరొకరు.. కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేసిన జై వర్మ ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేశాడు. అక్కడ అతను నెలకు 12,000-15,000 రూపాయలు సంపాదించే వాడు. అయితే యూట్యూబ్‌లో వీడియోల ద్వారా దాదాపు రూ.30,000- 35,000 సంపాదన రావడంతో టీచర్‌ జాబ్‌కు రిజైన్‌ చేసి ఈ రంగంలోకి అడుగపెట్టాడు. అలా వీరిద్దరి

నుంచి యూట్యూబ్ వీడియోలు మొదలయ్యాయి. ప్రస్తుతం వాళ్లిద్దరి సంపాదన ఏడాదికి లక్షల్లో ఉంది. ఇక దాదాపు ఆ గ్రామంలోని ప్రతి కుటుంబం YouTube వీడియోలలో పాల్గొంటుంది. అంతేకాకుండా అక్కడ యువత ఉద్యోగాలను పక్కను పెట్టి.. వీరినే ఫాలో అవుతూ యూ​ట్యూబ్‌ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం తులసి గ్రామం నుంచి 40-50 ఛానళ్లు తయారవుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top