World Gold Council: కరోనా పూర్వపు స్థాయికి బంగారం డిమాండ్‌

World Gold Council: India gold demand hits pre-pandemic levels - Sakshi

క్యూ3లో 192 టన్నులు

14 శాతం పెరుగుదల

ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక

ముంబై: బంగారం డిమాండ్‌ భారత్‌లో కరోనా ముందు నాటి స్థాయికి చేరుకుందుని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో డిమాండ్, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం పెరిగి 191.7 టన్నులుగా నమోదైనట్టు ప్రకటించింది. ‘బంగారం డిమాండ్‌ తీరు క్యూ3, 2022’ పేరుతో మంగళవారం ఓ నివేదిక విడుదల చేసింది. క్రితం ఏడాది సెప్టెంబర్‌ త్రైమాసికంలో బంగారం డిమాండ్‌ 168 టన్నులుగా ఉంది. విలువ పరంగా చూస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌ క్వార్టర్‌లో బంగారం డిమాండ్‌ 19 శాతం పెరిగి రూ.85,010 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.71,630 కోట్లు కావడం గమనార్హం.  

ఆభరణాల డిమాండ్‌ తీరు..
బంగారం ఆభరణాల డిమాండ్‌ మూడో క్వార్టర్‌లో 17 శాతం పెరిగి 146.2 టన్నులుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 125 టన్నులుగా ఉంది. విలువ పరంగా క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.53,300 కోట్ల డిమాండ్‌తో పోలిస్తే 22 శాతం పెరిగి రూ.64,800 కోట్లుగా ఉంది. ‘‘రుణ సదుపాయాలు విస్తరించడం ఈ డిమాండ్‌కు ప్రేరణనిస్తోంది. బ్యాంకు రుణ వితరణలో వృద్ధి తొమ్మిదేళ్ల గరిష్టానికి చేరింది. ముఖ్యంగా దక్షిణ భారత్‌లో వృద్ధి బలంగా ఉంది. దీంతో ఆభరణాలకు డిమాండ్‌ 17 శాతం పెరిగింది’’అని డబ్ల్యూజీసీ భారత్‌ హెడ్‌ పీఆర్‌ సోమసుందరం తెలిపారు. వర్షాలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలతో గ్రామీణ ప్రాంతాల్లో బంగారం డిమాండ్‌పై ప్రభావం ఉన్నట్టు చెప్పారు.

పెరిగిన పెట్టుబడులు..
ఇక బార్, కాయిన్ల డిమాండ్‌ సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 6 శాతం పెరిగి 45.4 టన్నులుగా (విలువ పరంగా రూ.20,150 కోట్లు) ఉంది. ‘‘బంగారం ధరలు తగ్గడం, బలహీన ఈక్విటీ మార్కెట్లు, పండుగలతో ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆసక్తి చూపించారు. పెరుగుతున్న వడ్డీ రేట్ల వాతావరణం, రూపాయి బలహీనత వంటి అంశాలతో సురక్షిత సాధనమైన బంగారంలో రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతాయి. ఈ ఏడాది మిగిలిన కాలంపై ఆశావహ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వివాహాలు, దీపావళి డిమాండ్‌ నాలుగో త్రైమాసికం గణాంకాల్లో ప్రతిఫలిస్తుంది. అయితే గతేడాది ఇదే కాలంలో కనిపించిన రికార్డు స్థాయి పనితీరు సాధ్యపడకపోవచ్చు.

ఈ ఏడాది మొత్తం మీద బంగారం డిమాండ్‌ 750–800 టన్నులుగా ఉంటుంది’’అని సోమసుందరం వివరించారు. 2021లో బంగారం దిగుమతులు 1,003 టన్నులుగా ఉండగా, ప్రస్తుత మార్కెట్‌ సెంటిమెంట్‌ను పరిశీలిస్తే గతేడాది గణాంకాలను మించదని ఆయన అంచనా వేశారు. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో (సెప్టెంబర్‌ వరకు) 559 టన్నుల బంగారం దిగుమతి అయినట్టు చెప్పారు. రెండు, మూడో త్రైమాసికంలో బంగారం ధరలు 4 శాతం తగ్గినట్టు.. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 10 గ్రాముల బంగారం సగటు ధర రూ.44,351గా ఉన్నట్టు చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top