ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) ‘చాట్‌జీపీటీ గో’(ChatGPT Go) సబ్‌స్క్రిప్షన్‌ను భారతీయులకు ఏడాదిపాటు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు ఈ ప్లాన్‌ను మరో ఏడాదిపాటు డిఫాల్ట్‌గా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వారం చివరి నుంచి ఈ ఆఫర్‌ను అమలు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ పొడిగింపునకు సంబంధించి వినియోగదారుల తరఫున ఎటువంటి చర్యలు అవసరం లేదని స్పష్టం చేసింది. వారి బిల్లింగ్ తేదీని 12 నెలలకు వాయిదా వేస్తూ చాట్‌జీపీటీ గో అన్ని సర్వీసులు అందిస్తామని హామీ ఇచ్చింది.
భారత్‌పై ఓపెన్‌ఏఐ దృష్టి
చాట్‌జీపీటీ గో (ChatGPT Go)ను భారతదేశంలోని వినియోగదారులకు ఏడాదిపాటు ఉచితంగా అందించనున్నట్లు ఓపెన్‌ఏఐ ఇటీవల ప్రకటించింది. నవంబర్ 4 నుంచి పరిమిత కాలం పాటు నిర్వహించే ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో నమోదు చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చని తెలిపింది. భారత్‌లో తొలిసారిగా నవంబర్ 4న బెంగళూరులో డెవ్‌డే ఎక్స్ఛేంజ్ (DevDay Exchange-బైకర్ ప్రోగ్రామ్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగానే ఈ ఉచిత ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది.
క్వెరీలు, ఇమేజ్ జనరేషన్ పరిమితులు తక్కువగా ఉండే ఈ చాట్‌జీపీటీ గో ప్లాన్‌ను భారతీయ వినియోగదారుల కోసం అందుబాటు చార్జీలతో అందించాలనే లక్ష్యంతో ఓపెన్‌ఏఐ ఈ ఏడాది ఆగస్టులో దీన్ని ఆవిష్కరించింది.
చాట్‌జీపీటీ వర్సెస్ చాట్‌జీపీటీ గో
| అంశం | చాట్‌జీపీటీ ఫ్రీ | చాట్‌జీపీటీ గో | 
|---|---|---|
| ధర | ఉచితం | నెలకు రూ.399 (ప్రస్తుతానికి ఏడాది ఉచితం) | 
| ప్రధాన మోడల్ | GPT-3.5, పరిమిత GPT-5 యాక్సెస్ | మెరుగైన/ విస్తరించిన GPT-5 యాక్సెస్ | 
| మెసేజ్ పరిమితులు | చాలా పరిమితం, పీక్ అవర్స్‌లో వేగం తగ్గుతుంది | ఫ్రీ ప్లాన్ కంటే 10 రెట్లు ఎక్కువ మెసేజ్ పరిమితులు | 
| ఇమేజ్ జనరేషన్ | పరిమితంగా ఉంటుంది | ఫ్రీ ప్లాన్ కంటే 10 రెట్లు ఎక్కువ ఇమేజ్ జనరేషన్ | 
| ఫైల్ అప్‌లోడ్ | చాలా పరిమితం (ఎంచుకున్న ఫైల్స్) | మరింత ఎక్కువ ఫైల్స్ అప్‌లోడ్ చేయవచ్చు. | 
| డేటా విశ్లేషణ | ప్రాథమిక, పరిమిత యాక్సెస్ | అడ్వాన్స్డ్ డేటా విశ్లేషణకు మెరుగైన యాక్సెస్ | 
| కస్టమ్ జీపీటీలు | యాక్సెస్ లేదు | కస్టమ్ జీపీటీలు, ప్రాజెక్ట్‌లు, టాస్క్‌లకు యాక్సెస్ | 
| లక్షిత వినియోగదారులు | సాధారణ, అప్పుడప్పుడు ఉపయోగించే వినియోగదారులు | విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, మెరుగైన యాక్సెస్ కోరుకునే సాధారణ వినియోగదారులు | 
చాట్‌జీపీటీ గో వర్సెస్ మైక్రోసాఫ్ట్ కోపైలట్
| అంశం | చాట్‌జీపీటీ గో | మైక్రోసాఫ్ట్ కోపైలట్ | 
|---|---|---|
| ప్రధాన ఏకీకరణ | స్టాండలోన్ చాట్‌బాట్, అన్ని ప్లాట్‌పామ్‌లకు వర్తిస్తుంది (API ద్వారా విస్తృత ఏకీకరణ) | మైక్రోసాఫ్ట్ 365 (Word, Excel, Outlook, Teams, GitHub) అప్లికేషన్లలో ఏకీకృతం చేశారు. | 
| ప్రధాన లక్ష్యం | సాధారణ సంభాషణ, సృజనాత్మకత, కోడింగ్, చిన్న వ్యాపార ఉత్పాదకత | మైక్రోసాఫ్ట్ ఎకోసిస్టమ్ (Ecosystem) లోని ఎంటర్ప్రైజ్ ప్రొడక్షన్, పనుల ఆటోమేషన్ | 
| డేటా సోర్స్ | ఓపెన్‌ఏఐ శిక్షణ డేటాసెట్లు + వెబ్ సెర్చ్ | ఓపెన్‌ఏఐ మోడల్స్ + బింగ్ సెర్చ్ + వినియోగదారుల సంస్థాగత డేటా (M365 ఫైల్స్) | 
| భద్రత | యూజర్ డేటాను ఏఐ శిక్షణకు ఉపయోగించకుండా నిలిపివేయవచ్చు (గో, ప్లస్ ప్లాన్లలో) | ఎంటర్‌ప్రైజ్ ప్లాన్లలో స్ట్రక్చరల్ భద్రతా | 
| కస్టమ్ టూల్స్ | కస్టమ్ జీపీటీలను రూపొందించే సామర్థ్యం (గో లో పరిమిత యాక్సెస్) | MS 365 యాప్లలో నిర్దిష్ట పనులు చేయగల సామర్థ్యం | 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
