డబ్బున్నోళ్లంతా ఎందుకిలా చేస్తారు? ఈలాన్‌ మస్క్‌ ఆసక్తికర సమాధానం

Why Elon Musk Turned His House Into Nightclub - Sakshi

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు తెచ్చుకోవడం, ఆ వెంటనే కోట్లాది మంది యూజర్లు ఉన్న ట్విటర్‌ను నాటకీయ పరిస్థితుల్లో ప్రైవేటు కంపెనీగా మార్చడం. బస్సుల్లో ఊరెళ్లి వచ్చినట్టు రాకెట్లలో అంతరిక్ష ప్రయాణానికి ప్రణాళికలు రూపొందించం వంటి పనుల్తో టాక్‌ ఆఫ్‌ ది వరల్డ్‌గా మారిపోయాడు ఈలాన్‌ మస్క్‌. దీంతో ఈలాన్‌ మస్క్‌ ఎదుగుదలపై రకరకాల కథనాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటికి ఎంతో ఓపిగ్గా బదులిచ్చాడు ఈలాన్‌ మస్క్‌.

ధనవంతుల కుటుంబాలకు చెందిన పిల్లలు విచిత్రంగా చిత్రలేఖనం వంటి కళలకు స్కూల్స్‌కి వెళ్తుంటారు. చదువయ్యాక ఉద్యోగాలు చేయరు. వృధాగా గడిపేస్తుంటారు. ఇంత చేసినా ఒక్కోసారి ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చే ఈలాన్‌ మస్క్‌ లాంటి వారయితే అనూహ్యమైన విజయాలను సాధిస్తుంటారు. ఇందుకు కారణం ఏంటి అంటూ నేరుగా ఈలాన్‌ మస్క్‌నే డోనా అనే టీనేజ్‌ ట్విటర్‌ యూజర్‌ ప్రశ్నించింది.

కసి
డోనా ప్రశ్నకు ఈలాన్‌ మస్క్‌ బదులిస్తూ.. డబ్బులేని వాళ్లతో పోల్చినప్పుడు అదున్నవాళ్ల దగ్గర  ఏదైనా సాధించాలనే కసి (మోటివేషన్‌) తక్కువగా ఉంటుందంటూ చెప్పాడు. నేను మొదటి స్టార్టప్‌ అయిన జిప్‌2ను 1995లో ప్రారంభించేప్పుడు నా దగ్గర స్టూడెంట్‌లోనుగా తీసుకున్న వంద డాలర్లు, ఒక కంప్యూటర్‌ మాత్రమే ఉందంటూ బదులిచ్చాడు.

అవన్నీ కట్టు కథలే
ఈ సంభాషణలోకి వచ్చిన ఇండియన్‌ యూజర్‌ ప్రణయ్‌ పటోల్‌ మాట్లాడుతూ... ఈలాన్‌ మస్క్‌ పుట్టుకతోనే ధనవంతుడనే తప్పుడు ప్రచారం బాగా జరుగుతోంది. ఈలాన్‌ మస్క్‌ తండ్రికి ఎమరాల్డ్‌ మైన్స్‌ ఉండేవంటూ లేని పోని కథలు చక్కర్లు కొడుతున్నాయి... అసలు ఈలాన్‌ మస్క్‌ తన కెరీర్‌ తొలి రోజుల్లో ఎలా పైకి వచ్చాడో మీకు తెలియదంటూ చెప్పాడు.

నైట్‌క్లబ్‌గా మారిన ఇళ్లు
ప్రణయ్‌ పటోల్‌ ట్వీట్‌కి ఈలాన్‌ మస్క్‌ సమాధానం ఇస్తూ కెరీర్‌ తొలి రోజులను గుర్తు చేసుకున్నారు.. ‘ మేము నివసిస్తు‍న్న ఇంటికి అద్దె చెల్లించే స్థోమత కూడా ఆ రోజుల్లో లేదు. దీంతో ఆ ఇంటి అద్దె చెల్లించే డబ్బుల కోసం, రాత్రి వేళ నేనుండే ఇంటిని నైట్‌ క్లబ్‌గా మార్చేవాడిని. ఎంట్రీకి 5 డాలర్లు వసూలు చేసేవాడిని’ అంటూ తన కెరీర్‌ తొలి రోజులను వివరించాడు ఈలాన్‌ మస్క్‌.

సౌతాఫ్రికా నుంచి మొదలు
దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈలాన్‌ మస్క్‌ తన కలల ప్రపపంచాన్ని వెతుక్కుంటూ అమెరికాకి వలస వచ్చాడు. అక్కడ పెన్సిల్వేనియా యూనివర్సిటీ డిగ్రీ పట్టా పొందాడు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదివేందుకు కాలిఫోర్నియా చేరుకుని అక్కడే తన సోదరుడు కింబల్‌తో కలిసి 1995లో వెబ్‌ సాఫ్ట్‌వేర్‌ స్టార్టప్‌ జిప్‌2ని నెలకొల్పాడు ఈలాన్‌ మస్క్‌. ఈ జిప్‌2ని కాంపాక్‌ సంస్థ 307 మిలియన్‌ డాలర్లకు 1999లో కొనుగోలు చేసింది. 

అంచెలంచెలుగా
జిప్‌2ను అమ్మగా వచ్చిన డబ్బుతో  బ్యాంక్‌.ఎక్స్‌ స్టార్టప్‌లో సహా వ్యవస్థాపకుడిగా మారాడు. 2000లో బ్యాంక్‌.ఎక్స్‌ను కాన్ఫినిటీలో విలీనం చేసి.. ఆ తర్వాత పేపాల్‌ను స్థాపించాడు. ఈ కొత్త స్టార్టప్‌ పేపాల్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. దీన్ని 1.5 బిలియన్‌ డాలర్లకు ఈబేకు కొనుగోలు చేసింది. పేపాల్‌ను అమ్మగా వచ్చిన సొమ్ముతో 2002లో స్పేస్‌ఎక్స్‌, 2004లో టెస్లాలో పెట్టుబడులు పెట్టి సహా వ్యవస్థాపకుడు అయ్యాడు ఈలాన్‌ మస్క్‌, ఆ తర్వాత తన అద్భుత వ్యూహ చతురతతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రూపాంతరం చెందాడు. ఇటీవల 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేశాడు.

చదవండి: నేనేం రోబోను కాదు.. నాకూ ఫీలింగ్స్‌ ఉన్నాయి: ఎలన్‌ మస్క్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top